గుంటూరు : ఏపీలో పోలింగ్ (ఏప్రిల్ 11,2019) తర్వాత కనిపించని జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, వైసీపీ లాగా జనసేన సీట్ల లెక్క వేయదన్నారు. జనసేనకు అన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయని తాను చెప్పను అన్నారు. జనసేన చెప్పే మార్పు మొదలైందని, దాన్ని కొనసాగిద్దామని పవన్ అన్నారు. మార్పు ఎప్పుడూ చిన్నగానే మొదలవుతుందని, జనసేన ఎదిగే దిశలో ఈ మార్పు ఎంతవరకు వెళ్తుందో తెలియదన్నారు. ఆదివారం(ఏప్రిల్ 21,2019) గుంటూరులోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అసెంబ్లీ అభ్యర్థులతో పవన్ సమావేశం అయ్యారు. ఎన్నికల్లో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు లేని వేళ కూడా ప్రజలతో మమేకమవ్వాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలని సూచించారు.
ఎన్నికల్లో ఓటింగ్ సరళి గురించి మాత్రమే వారిని అడిగి తెలుసుకున్నట్టు పవన్ చెప్పారు. గ్రామ స్థాయి నుంచి కొత్తతరం నేతలను తయారు చేయాలని పవన్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే మార్పును ప్రజల్లోకి తీసుకెళ్దామని నేతలతో అన్నారు. తెలంగాణలోనూ ఇదే తరహా మార్పును ప్రజలు ఆహ్వానిస్తున్నారని, ప్రతి గ్రామానికీ ఒక రోజు కేటాయించి అందరినీ కలవాలని నేతలకు నిర్దేశించారు. స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కారం దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమస్య పెద్దదైతే తానూ స్పందిస్తానని చెప్పారు. నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యాలయాలు కొనసాగించాలని సూచించారు. ప్రతి చోటా రెండు కుటుంబాలే పెత్తనం చేస్తున్నాయని, ఈ అంశంపైనే పోరాటం చేద్దామని పవన్ తన పార్టీ నేతలతో అన్నారు.
ఏపీలో పోలింగ్ తర్వాత పవన్ కనిపించలేదు. పోలింగ్ తర్వాత ఓటింగ్ సరళిపై రాజకీయ పార్టీలు స్పందించడం కామన్. పోలింగ్ సరళి ఎలా ఉంది, తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది చెబుతారు. చంద్రబాబు, జగన్ ఇలానే స్పందించారు. పోలింగ్ తర్వాత తమకు ఇన్ని సీట్లు వస్తాయని లెక్కలు చెప్పారు. తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వారిద్దరికి భిన్నంగా పవన్ వ్యవహరించారు. పోలింగ్ తర్వాత పవన్ కనిపించకపోవడం జనసేన శ్రేణులు, అభిమానుల్లో అనుమానాలు నింపింది. చివరికి పోలింగ్ జరిగిన 10 రోజుల తర్వాత పవన్ మీడియా ముందుకు వచ్చారు.