విజయవాడ: అనంతపురం జిల్లా గుంతకల్లు జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగలగొట్టిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఓటింగ్ ఛాంబర్‌లో ఎమ్మెల్యే, ఎంపీ అనే
విజయవాడ: అనంతపురం జిల్లా గుంతకల్లు జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగలగొట్టిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఓటింగ్ ఛాంబర్‌లో ఎమ్మెల్యే, ఎంపీ అనే పేర్లు సరిగా రాయలేదని పోలింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ గుప్తా ఈవీఎంను నెలకేసి కొట్టారు. దీంతో పోలీసులు గుప్తాని అరెస్ట్ చేశారు. జనసేన అభ్యర్థి ఈవీఎంని పగలగొట్టిన ఘటనపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు. విజయవాడలో ఓటు వేసిన తర్వాత పవన్ మీడియాతో మాట్లాడారు.
గుత్తిలోని బాలికోన్నత పాఠశాలలో 183వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగినట్లు తాను మీడియాలో చూశానని పవన్ తెలిపారు. వాస్తవంగా అక్కడ ఏం జరిగిందో తనకు తెలియదని అన్నారు. విషయం పూర్తిగా తెలుసుకోకుండా కామెంట్లు చేయడం సరికాదన్నారు. ఈ విషయమై పార్టీ వర్గాల నుంచి పూర్తి సమాచారం అందుకున్న తర్వాతే మాట్లాడతానని పవన్ స్పష్టం చేశారు.
గురువారం(ఏప్రిల్ 11, 2019) ఓటు వేసేందుకు జనసేన అభ్యర్థి గుప్తా గుత్తిలోని పోలింగ్ బూత్(183వ నెంబర్) కు వెళ్లారు. ఎన్నికల ఏర్పాట్లపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటింగ్ ఛాంబర్‌లో ఎమ్మెల్యే, ఎంపీ అనే పేర్లు సరిగా రాయలేదని పోలింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. సర్ది చెప్పడానికి అధికారులు ప్రయత్నించినా ఆయన శాంతించలేదు. కోపంతో ఈవీఎంని నేలకేసి కొట్టారు. దీంతో ఈవీఎం పగిలిపోయింది. పోలింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు.