ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోవడం లేదు. స్వయంగా సీఎంయే చెప్పినా డోంట్ కేర్ అంటున్నారు. వాహనదారుల ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. టోల్ ఫీజు చెల్లించాకే ముందుకు వదులుతున్నారు.
ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోవడం లేదు. స్వయంగా సీఎంయే చెప్పినా డోంట్ కేర్ అంటున్నారు. వాహనదారుల ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. టోల్ ఫీజు చెల్లించాకే ముందుకు వదులుతున్నారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల నిర్వాహాకుల తీరు వివాదాస్పదమైంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వాహనదారుల సౌలభ్యం కోసం టోల్ ఛార్జీలు రద్దు చేస్తూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. జనవరి 13(ఆదివారం), 16వ తేదీల్లో(బుధవారం) వాహనదారుల నుంచి ఎలాంటి టోల్ ఫీ వసూలు చేయొద్దని కేసీఆర్, చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో టోల్ సిబ్బంది ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేశారు. వాహనదారుల నుంచి టోల్ ఫీ వసూలు చేస్తున్నారు.
కృష్ణా జిల్లా కీసర, చిల్లకల్లు, పొట్టిపాడు, కలపర్రులో టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. టోల్ సిబ్బందితో వాహనదారులు గొడవకు దిగారు. ప్రభుత్వం ఆదేశించినా ఎందుకు టోల్ ఫీ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. టోల్ సిబ్బంది మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. మేము రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి రామని, కేంద్రం పరిధిలోకి వస్తామని, కేంద్రం నుంచి ఆదేశాలు వస్తేనే పాటిస్తామని తేల్చి చెబుతున్నారు. దీంతో చేసేది లేక టోల్ పీజు చెల్లించి వాహనదారులు ముందుకు కదులుతున్నారు. డబ్బు ఇవ్వడానికి తమకు ఎలాంటి సమస్య లేదని.. గంటలకొద్దీ క్యూలో వేచి ఉండటమే చాలా ఇబ్బందిగా ఉందని వాహనదారులు వాపోయారు.
తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. టోల్ ఛార్జీలు వసూలు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తున్నారు. హైదరాబాద్ వైపు వచ్చే వాహనదారుల నుంచి ఎలాంటి టోల్ ఫీ కలెక్ట్ చేయడం లేదు. కొర్లపహాడ్, పంతంగి టోల్ గేట్ల వద్ద విజయవాడ-హైదరాబాద్ వెళ్లే వాహనాల కోసం 12 ఉచిత కౌంటర్లను తెరిచారు.
టోల్ ప్లాజాల దగ్గర ఛార్జీలు వసూలు చేయడానికి ఒక్కో వాహనానికి చాలా సమయం తీసుకుంటుంది. పండుగ నేపథ్యంలో ఒక్కో టోల్ గేట్ దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కడుతున్న పరిస్థితి. దీంతో రద్దీ నివారించడానికి, ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆయా రూట్లలో వాహనాలు సాఫీగా సాగిపోవడానికి రెండు ప్రభుత్వాలు కూడా టోల్ గేట్ల దగ్గర ఛార్జీలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే కొన్నిచోట్ల యథావిధిగా ఛార్జీలు వసూలు చేయడంతో వాహనదారులు నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. కొన్నిచోట్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.