అమరావతి : జులైలో పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై బుధవారం (ఏప్రిల్ 17,2019) అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వ పనులు వేగంగా పూర్తి చెయ్యాలని ఆదేశించారు. ఇప్పటివరకు ప్రాజెక్ట్ నిర్మాణం 69శాతం వరకు పూర్తైందని, కాంక్రీట్ పనులు 72.40 శాతం పూర్తయ్యాయని అధికారులు సీఎంకి చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు నెల రోజులకుపైగా సమయం ఉందన్న సీఎం.. వాటి గురించి ఎదురుచూడటం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల అవసరాలు, రాష్ట్రాభివృద్ధే తనకు ముఖ్యం అని స్పష్టం చేశారు.
సుదీర్ఘ విరామం తర్వాత సీఎం చంద్రబాబు అభివృద్ది కార్యక్రమాలపై సమీక్షలు మొదలుపెట్టారు. ముందుగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను చంద్రబాబు రివ్యూ చేస్తున్నారు. ఇది 90వ రివ్యూ. జులైకల్లా ఎట్టిపరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చెయ్యాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చెయ్యాలని చంద్రబాబు అధికారులతో చెప్పారు. ఇప్పటికే రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 66 శాతం పూర్తయినట్టు అధికారులు తెలిపారు. ఎగువ కాపర్ డ్యాం పనులు 40శాతం, దిగువ కాపర్ డ్యామ్ పనులు 25శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా నీరు ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు.