కోడి పందాలపై పోలీస్ : బావిలో పడి ఇద్దరి మృతి 

  • Publish Date - January 11, 2019 / 06:06 AM IST

సంక్రాంతి వచ్చింది సరదాలు తెచ్చింది.. వీటికంటే ముందు ఓ విషాదాన్ని కూడా తీసుకొచ్చింది. పల్లెల్లోని కోడిపందాలు వివాదాలకు కారణం అవుతున్నాయి. ఏపీ రాష్ట్రం కృష్ణా జిల్లాలో జరిగిన ఓ ఘటన సంచలనం అయ్యింది. చాట్రాయి మండలం చిత్తవూరు గొల్లగూడెంలో ఇద్దరి ప్రాణాలు తీసిన ఘటనతో చుట్టుపక్కల గ్రామాల్లోని ఉద్రిక్తత నెలకొంది. సంక్రాంతి పండుగ సంబరాలు మొదలైన రోజే జరిగిన విషాదంతో కోడి పందాలరాయుళ్లలో టెన్షన్ మొదలైంది. పోలీస్ ఆంక్షలు ఉన్నాయని చాటింపు వేశామని ఖాకీలు సమర్ధించుకుంటున్నా.. ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో అనే ఆందోళన గ్రామాల్లో నెలకొంది.

అసలు ఏం జరిగింది?
కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గొల్లగూడెంలో కోడి పందాలు ఆడుతున్నారన్న సమాచారం పోలీసులు అందింది. ఓ జీపులో బయలుదేరారు. గ్రామంలోకి వెళ్లారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారం పందెంరాయుళ్లకు చేరింది. వెంటనే వారు తప్పించుకోవటానికి పరిగెత్తారు. పొలాల్లో పరిగెత్తుతూ అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడ్డారు ఇద్దరు యువకులు. అందులో నీళ్లు ఎక్కువగా ఉండటం, బయటకు వచ్చే మార్గం లేకపోవటంతో చనిపోయారు. మృతులను చిట్టూరి శ్రీనివాసరావు, మేక చెన్నకేశవరావుగా గుర్తించారు. సంక్రాంతి సంబరాలు మొదటి రోజే ఇలా జరగటంతో గ్రామంలో విషాదం నెలకొంది. 

గ్రామస్తుల్లో కట్టలు తెగిన ఆగ్రహం :
పందాలు వేయకుండా సంప్రదాయంగానే కోడి పందాలు ఆడుతున్నాం అంటున్నారు గ్రామస్తులు. పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువకుల మృతికి పోలీసులే కారణం అంటూ ఆందోళనకు దిగారు. చాట్రాయి మండలం పరిధిలోని నాలుగు గ్రామా ప్రజలు ప్రతి ఏటా కోడి పందాలు ఆడుతుంటారు. ఈ గ్రామాల్లో జనవరి 10వ తేదీ కలెక్టర్ పర్యటించారు. పందాలు లేకుండా ఆడుకుంటే అభ్యంతరం లేదని చెప్పినట్లు గ్రామస్తులు అంటున్నారు. కలెక్టర్ హామీ ఇచ్చినా పోలీసులు ఎలా దాడి చేస్తారని ప్రశ్నిస్తున్నారు గ్రామంలోని యువకులు. పోలీసుల తీరుపై ఆగ్రహంతో ఉన్నారు గ్రామస్తులు.

ట్రెండింగ్ వార్తలు