పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. చింతమనేని కోసం 4 ప్రత్యేక
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. చింతమనేని కోసం 4 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఏలూరు, హైదరాబాద్ లో గాలిస్తున్నాయి. ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో.. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆగస్టు 30న చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
పినకడిమికి చెందిన యువకులపై చింతమనేని దౌర్జన్యం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇసుక తవ్వకాలకు సంబంధించిన వ్యవహారంలో తమను కులం పేరుతో దూషించి దాడికి ప్రయత్నించారని చింతమనేనిపై కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. చింతమనేనితో పాటూ మరికొందరు అనుచరులపైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
కులం పేరుతో దూషించారన్న ఆరోపణలను చింతమనేని ఖండించారు. టీడీపీ ధర్నాలతో ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు. తనపై కక్షపూరితంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. తాను మళ్లీ ప్రజా పోరాటాలతో బయటకు వస్తుంటే చూడలేక అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదన్నారు. తన తప్పు ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. తప్పుడు కేసులతో ఇరికించాలని చూడటం దారుణమన్నారు.