పోలీసుల చేతికి కోడెల పోస్ట్ మార్టం రిపోర్ట్: వైర్ తో ఉరి వేసుకున్నట్లు నిర్థారణ

  • Publish Date - September 18, 2019 / 10:12 AM IST

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీసుల చేతికి వచ్చింది. కోడెల పోస్ట్ మార్టమ్ రిపోర్టును ఉస్మానియా డాక్టర్లు బంజారా హిల్స్ పోలీసులకు సీల్డ్ కవర్ లో అందజేశారు. వైర్ తోనే కోడెల ఉరి వేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. వైర్ వాడటం వల్ల మెడపై గాట్లు పడ్డాయని రిపోర్ట్ లో వెల్లడైంది.  

కోడెలను చివరిసారిగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి డాక్టర్ సునీతతో మాట్లాడారనీ పోలీసులు వెల్లడించారు.కాగా గతంలో కూడా కోడెల ఒకసారి ఆత్మహత్యకు యత్నిచారని పోలీసులు విచారణలో వెల్లడైంది. కానీ అప్పట్లో ఆయనకు గుండెపోటు వచ్చిందనీ కుటుంబ సభ్యులు చెప్పారని బంజారాహిల్స్ పోలీసుల విచారణలో వెల్లడైంది. 
కాగా..కోడెల మృతిపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం అయిన క్రమంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీసులకు అందటం అనుమానాలు నివృతమయ్యాయి. కాగా సెప్టెంబర్ 18న నరసరావుపేటలో కోడెల అంత్యక్రియలు జరగనున్నాయి. కోడెల అంతిమ యాత్రలో మాజీ సీఎం చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు, టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. 

కోడెల మృతిపై మంత్రి బొత్స డౌట్స్ 
కోడెల శివప్రసాద్ మృతిపై సమగ్రంగా విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్నిఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. కోడెల మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయనీ.. ముందు హార్ట్ ఎటాక్ అనీ..తరువాత ఆత్మహత్య అని అంటున్నారు. ఇలా పలు విధాలుగా వార్తలు వస్తున్న క్రమంలో విచారణ జరగాలని కోరారు. కోడెల శరీరంపై గాయాలున్నాయా? లేదా అనేది కూడా చూడాలని బొత్స అనుమానాలు వ్యక్తంచేశారు.   

సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన చంద్రబాబు
కోడెల మృతిపై ప్రభుత్వ తీరుపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. కోడెల ఆత్మహత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఓ రాజకీయ నాయకుడు ఇలా వేధింపులకు గురై తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవటం తాను ఎక్కడా చూడలేదన్నారు. ఇది ముమ్మాటికీ  ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు.

కోడెలమీద, ఆయన కుమారుడు, కమార్తెల మీద రెండు నెలల్లో 19 కేసులు పెట్టి మానసికంగా కుంగిపోయేలా చేసి..ఆత్మహత్య చేసుకునేలా చేశారని విమర్శించారు.  కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు కోడెలను వేధించారనీ..ఎంత క్షోభకు గురయ్యారో తెలుస్తోందన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం అరాచకాలతో ఏపీ భ్రష్టుపట్టిపోయిందని చంద్రబాబు  మండిపడ్డారు.