వేలంలో సర్పంచ్ పదవి  : రూ.63 లక్షలు 

  • Publish Date - January 10, 2019 / 10:19 AM IST

రత్వా తండా : తెలంగాణలో మొదటి విడతగా పంచాయితీ ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామినేషన్ల గడువు జనవరి 8తో ముగిసింది. చివరి రోజు కావటంతో నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థులతో నామినేషన్ కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. ఈ తొలి విడతలో పలు పంచాతీలలో సర్పంచ్ పదవి  ఏకగ్రీవం కానున్నాయి. ఈ క్రమంలో  నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తండ్రి కన్నీలాల్ రత్వా తండాకు సర్పంచ్‌గా ఏకగ్రీవమయ్యారు. మరోవైపు గుర్రంపోడు మండల కేంద్రంలో సర్పంచ్ పదవిని అధికార పార్టీ నాయకుడు రూ.63.03 లక్షలకు దక్కించుకున్నట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది. అలాగే ఇదే మండలంలోని  చామలేడు పంచాయతీని రూ.16.50లక్షలు, మైలాపురంలో రూ.16.50లక్షలకు వేలంపాటలో అభ్యర్ధులు పాట పాడుకుని సర్పంచ్ కానున్నట్లుగా తెలుస్తోంది. 

మొదటివిడత పంచాయితీ ఎన్నికల్లో భాగంగా జనవరి 21న 4,480 పంచాయతీలకు, 39,832 వార్డులకు ఎన్నికలు జరగనున్న క్రమంలో అభ్యర్థులు వేసిన నామినేషన్ పత్రాలను జనవరి 10న  నామినేషన్ పత్రాలను పరిశీలించి సరైనవాటిని  ప్రకటించనున్నారు. తిరస్కరించిన నామినేషన్లకు బదులుగా 11న తిరిగి అప్పీలు చేసుకునే అవకాశాన్ని  కల్పించారు. ఈ క్రమంలో నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ ఆఖరి తేదీగా అధికారులు నిర్ణయించారు.