ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతున్నాయా?

  • Publish Date - April 30, 2019 / 10:28 AM IST

ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదన మంటలు రేపుతోంది. యాజమాన్యం తీరు కార్మిక సంఘాల నేతల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థను.. ప్రస్తుత నిర్ణయం మరింత ఊబిలోకి నెట్టడం ఖాయమని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సిబ్బంది జీతాల పెంపుతో ఆర్టీసీపై పెనుభారం పడుతోందని.. దానిని పూడ్చుకునేందుకు ఛార్జీలు పెంచాలనుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఆర్టీసీ నష్టాలకు కారణమని ఆరోపిస్తున్నాయి. డీజిల్ ధరల పెరుగుదల ఆర్టీసీని నష్టాల్లోకి నెడుతోందన్నారు కార్మిక సంఘాల నేతలు. తక్షణమే 640 కోట్ల రూపాయలిస్తేనే ఆర్టీసీ బతుకుతుంది అంటున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం పైసా కూడా విదల్చడం లేదని.. గత బడ్జెట్‌లో కేటాయించిన 345 కోట్ల రూపాయలను కూడా ఇంతవరకు విడుదల చేయలేదంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్టీసీ దూరమయ్యిందంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ఎక్కువ శాతం మంది ఆటోల్లో ప్రయాణిస్తున్నారని.. మరోసారి ఛార్జీలు పెంచితే ప్రయాణికులు ఆర్టీసీ వైపు కన్నెత్తి చూసే పరిస్థితి కూడా ఉండదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదనపై అటు ప్రజల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కార్మిక సంఘాల డిమాండ్లను, ప్రజల అభిప్రాయాలను ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటాయా లేదా అని చూడాలి. ఇప్పటికిప్పుడు ఆర్టీసీ ఛార్జీలను యాజమాన్యం పెంచితే.. అది రాజకీయంగా కలకలం రేపే అవకాశం ఉంది.