పబ్జీ.. ఈ ఆన్ లైన్ గేమ్ ప్రాణాలు తీస్తోంది. పబ్జీ గేమ్ కి బానిసలుగా మారిన వారిలో కొందరు చనిపోతుంటే.. మరికొందరు మంచాన పడుతున్నారు. ఇన్ని అనర్థాలు జరుగుతున్నా
పబ్జీ.. ఈ ఆన్ లైన్ గేమ్ ప్రాణాలు తీస్తోంది. పబ్జీ గేమ్ కి బానిసలుగా మారిన వారిలో కొందరు చనిపోతుంటే.. మరికొందరు మంచాన పడుతున్నారు. ఇన్ని అనర్థాలు జరుగుతున్నా యువతలో మార్పు రావడం లేదు. తాజాగా మరో యువకుడు పబ్జీ కారణంగా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. వనపర్తికి చెందిన కేశవర్థన్ కి కాలు, చేయి పడిపోయాయి. కదల్లేని పరిస్థితుల్లో ఉన్నాడు. మంచానికే పరిమితం అయ్యాడు. కేశవర్దన్ డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. నెల రోజుల నుంచి మొబైల్ లో పబ్జీ ఆడుతున్నాడు. రాత్రి, పగలు తేడా లేకుండా గడిపేస్తున్నాడు. రాత్రి పూట దుప్పటి కప్పుకుని మరీ గేమ్ ఆడేవాడు. చివరికి కాలేజీకి వెళ్లినా అదే పని. తల్లి పిలిచినా పట్టించుకోడు. ఆకలి లేదని చెప్పి భోజనం మానేసేవాడు. లేదంటే అరకొరగా తిని అయిందనిపించేవాడు. ఇలా నెల రోజులు ఇదే తీరు. దీంతో అతడి ఆరోగ్యం పూర్తిగా పాడైంది. సమయానికి ఆహారం, నీరు తీసుకోకపోవడంతో తీవ్రంగా నీరసించాడు.
వారం రోజుల క్రితం జ్వరంతోపాటు వాంతులు రావడంతో స్థానికంగా ఓ ఆసుపత్రిలో తల్లి చూపించింది. డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకున్నా.. జ్వరం తగ్గలేదు. వాంతుల వల్ల డీహైడ్రేషన్ పెరిగింది. చివరికి బ్రెయిన్ పై తీవ్ర ఒత్తిడి పడి పరిస్థితి విషమించింది. బ్రెయిన్ లో రక్తస్రావమైంది. కేశవర్ధన్ కుడికాలు, చేయి పడిపోయాయి. కంగారు పడిన తల్లి ఆగస్టు 26న సికింద్రాబాద్ లోని సన్ షైన్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. న్యూరో ఫిజీషియన్ డాక్టర్ వినోద్ ఆధ్వర్యంలోని బృందం కేశవర్ధన్ కి ట్రీట్ మెంట్ చేసింది.
అయినా లాభం లేకపోయింది. బ్రెయిన్ కి బ్లడ్ సరఫరా చేసే నరాల్లో అడ్డంకులు ఏర్పడినట్లు డాక్టర్లు గుర్తించారు. సమయానికి ఆహారం, నీరు తీసుకోకపోవడం, నిద్రలేమి వల్ల శరీరంలో సోడియం, పోటాషియం స్థాయిలు తగ్గి అది చివరికి మెదడుపై ప్రభావం చూపిందన్నారు. యువకుడు పూర్తిగా కోలుకోవడంతో ఇక తమ వల్ల కాదని డాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో శనివారం(ఆగస్టు 31,2019) ఇంటికి పంపించేశారు. తనకు అండగా ఉంటాడని భావించిన తల్లి.. కొడుకు ఇలా అచేతంగా మారడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటన తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక లాంటిది. పిల్లలు సెల్ ఫోన్ తో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనేది ఓ కంట కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం సందేహం వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.