ఏపీకి రాహుల్ గాంధీ
- madhu
- Published On : March 31, 2019 / 01:15 AM IST
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. మార్చి 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన విజయవాడ చేరుకుంటారు. విజయవాడలోనే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి బూత్ కమిటీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత, రైతు రుణమాఫీ, కనీస ఆదాయ పథకంపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే మోదీని ఎందుకు గద్దె దింపాలో వివరించనున్నారు.
విజయవాడలో బూత్ కమిటీ కార్యకర్తలతో సమావేశం ముగిసిన వెంటనే ఆయన అనంతపురం జిల్లాలోని కల్యాణ దుర్గం వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.30కు అక్కడ నిర్వహించనున్న ఎన్నికల బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. రాహుల్ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పరిశీలించారు. కళ్యాణ నియోజకవర్గం నుండి రఘువీరారెడ్డి ఎన్నికల బరిలో నిలుచున్న సంగతి తెలిసిందే. రాహుల్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
