కూలిన చెట్లు, స్తంభాలు : శ్రీశైలంలో గాలివాన బీభత్సం

  • Publish Date - May 15, 2019 / 10:34 AM IST

ఏపీ రాష్ట్రంలో వాతావరణంలో అప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి. ఉదయం వరకు ఎండ తీవ్రత, ఉక్కబోతగా ఉంటుంది. సాయంత్రం అయితే ఈదురుగాలులు, పిడుగులు, వర్షం పడుతుంది. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు శ్రీశైలంలో జరిగింది. కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో గాలివాన బీభత్సం చేసింది. మే 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో భారీ వర్షం పడింది. గాలుల బీభత్సానికి భయపడ్డారు భక్తులు.

బలమైన ఈదురుగాలులకు అన్నదాన సత్రం, పరిపాలన భవనం దగ్గర చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. భక్తుల కోసం వేసిన చలువ పందిళ్లు ఎగిరిపోయాయి. భక్తులు సైతం భయంతో పరుగులు తీశారు. కాటేజీల్లోకి వెళ్లిపోయారు. క్యూలైన్లలోని భక్తులు సైతం వణికిపోయారు.

విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం, చెట్లు కూలిపోవటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాటి చెట్లు, వేప చెట్లు పెద్ద ఎత్తున కూలిపోయాయి. చెట్ల దగ్గర ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. విరిగిన పడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు తొలగిస్తున్నారు. ఏర్పాట్లను చక్కదిద్దుతున్నారు. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. సమ్మర్ హాలిడేస్ కావటంతో.. భారీ సంఖ్యలో భక్తులు కూడా వచ్చారు.