వరంగల్ పోలీసులు రౌడీషీటర్ల మేళా నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకుండా సాధారణ జీవితం గడుపుతున్న 137మంది గుర్తించి వారిపై ఉన్న రౌడీషీట్లను తొలగించారు.
సహజంగా ఎక్కడైనా కారు మేళాలు, బైకు మేళాలు, జాబ్ మేళాలు వింటుంటాం. కానీ వరంగల్‌లో రౌడీషీటర్ల మేళా నిర్వహించారు పోలీసులు. వినడానికి వింతగా ఉన్నా… ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేళా ద్వారా రౌడీషీటర్లకు పోలీసులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగిన వారిని విడుదల చేసినట్లే… రౌడీషీటర్లలో సత్ప్రవర్తన కలిగిన వారిని గుర్తించి వారిపై ఉన్న కేసులు ఎత్తివేశారు. తద్వారా వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్లలో మొత్తం 783 మందిపై రౌడీషీట్ ఉంది. వీరందరి ఫొటోలు ఆయా పోలీస్ స్టేషన్లలోని నోటీస్ బోర్డులపై ఉన్నాయి. ఆ పీఎస్ పరిధిలో ఏ నేరం జరిగినా ముందుగా స్టేషన్‌కు పిలిపించి విచారించేది వీరినే. అంతేకాదు.. ఉత్సవాలు, పండగలు, ఎన్నికల సమయంలో ముందస్తుగా వీరందరినీ బైండోవర్ చేస్తారు. తెలిసో తెలియకో తప్పుచేసిన వీరిలో కొందరు ఇప్పుడు క్రైమ్స్‌కు దూరంగా ఉన్నారు.
అయినా ఎప్పుడో చేసిన నేరానికి వీరంతా ఇప్పటికీ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇలాంటి వారి కష్టాలను గుర్తించిన పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ రవీందర్.. వారికి సంతోషం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. రౌడీషీట్స్ ఉన్న 783మందిలో.. ఇప్పుడు ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకుండా సాధారణ జీవితం గడుపుతున్న 137మంది గుర్తించి వారిపై ఉన్న రౌడీషీట్లను తొలగించారు.
పోలీసుల నిర్ణయంపై వీరంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఆఫీసర్ కావాలనుకున్న తన కలను… క్షణికావేశంలో చేసిన ఓ తప్పు నెరవేరకుండా చేసిందని ప్రశాంత్ అనే వ్యక్తి వాపోయాడు. తనపై ఉన్న రౌడీషీట్ క్లోజ్ అవడంతో తప్పకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటానని నమ్మకంతో చెబుతున్నాడు.
ప్రశాంత్‌లాంటి వారెందరో ఈ మేళాకు హాజరయ్యారు. వారంతా ఇన్నాళ్లు తాము అనుభవించిన వేదనను ఇక్కడ వెల్లబోసుకున్నారు. తెలియకుండా చేసిన తప్పులకు శిక్షలు అనుభవించామని.. ఇకపై ప్రశాంతంగా బతకుతామని చెప్పారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా సాధారణ జీవితం గడుపుతున్నందునే వీరిపై రౌడీ షీట్లను ఎత్తివేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ విశ్వనాధ్ రవీందర్ చెప్పారు. వీరు భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు.