ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కోసం ఆయా జిల్లా కలెక్టర్లు నివేదిక పంపటంతో… వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. మరోవైపు నెల్లూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ ఘటనలకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటికే ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన ఈసీ… బాధ్యులైన అధికారులపై వేటు వేసేందుకు సిఫారసు చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని… రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో రెండేసి చోట్ల… ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరింది. హింసాత్మక ఘటనలు, సాంకేతిక లోపాల కారణంగా చాలామంది ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని… ఆయా జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. ఈ నేపథ్యంలో రీపోలింగ్ నిర్వహణపై సీఈవో ద్వివేది… కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం కలనూతలలో ఉన్న 247వ పోలింగ్ స్టేషన్‌లో… అడ్జయింగ్ పోలింగ్‌కు జిల్లా రిటర్నింగ్ అధికారి సిఫారు చేశారు. దీన్ని పరిశీలించిన ఎన్నికల సంఘం… రీపోలింగ్‌కు ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కలనూతల పోలింగ్ స్టేషన్‌లో ఈనెల 11న అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగింది. రాత్రి 12 గంటల తర్వాత ఈవీఎంలు స్లీప్ మోడ్‌లోకి వెళ్లాయి. దీంతో చాలామంది ఓటర్లు ఓటు వేయకుండా వెనుదిరిగారు. దీనిపై జిల్లా అధికారులు సిఫార్సు చేయడంతో… అడ్జయింగ్ పోలింగ్‌కు ఈసీ అంగీకరించింది.
కాగా గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని 94వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని కలెక్టర్ సిఫార్సు చేశారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని 244వ పోలింగ్ స్టేషన్‌లో కూడా మరోసారి పోలింగ్ నిర్వహించాలని కోరారు. కలెక్టర్ ప్రతిపాదనను సీఈవో ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. ఈ రెండు కేంద్రాలతో పాటు నెల్లూరు జిల్లాల్లోని మరో రెండుచోట్ల రీపోలింగ్ నిర్వహించే అంశంపై ఈసీఐ ఇవాళ నిర్ణయం ప్రకటించే అవకాశముంది.
రాష్ట్రంలో ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలంటూ కలెక్టర్ల నుంచి వచ్చిన సిఫార్సులను… కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని సీఈవో ద్వివేది తెలిపారు. విశాఖ, మచిలీపట్నం, నెల్లూరు జిల్లాల్లో జరిగిన ఘటనలపైనా నివేదించామన్నారు. ఈసీఐ ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పులు బయటకు రావడంపై… ఇప్పటికే పోలీసు కేసు నమోదు అయ్యిందని గుర్తు చేశారు. ఈ ఘటనలో రిటర్నింగ్ అధికారి, అదనపు రిటర్నింగ్ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ద్వివేది తెలిపారు.
మరోవైపు స్ట్రాంగ్‌రూముల్లో ఉన్న ఈవీఎంలను… అక్కడే ఉంచాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ద్వివేది వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో పోలింగ్ కోసం ఇక్కడ వినియోగించని ఈవీఎంలను తరలించాల్సి వస్తే.. రాజకీయ పార్టీలు, పోటీ చేసిన అభ్యర్ధులు, మీడియా సమక్షంలో పరిశీలించి వాటిని తరలిస్తామని స్పష్టం చేశారు.