26 జనవరి 2019, 70వ గణతంత్ర దినోత్సవానికి దేశమంతా సిద్ధమవుతోంది. ప్రతీ సంవత్సరం లాగానే ఈసారి కూడా రిపబ్లిక్ డే వేడుకలు దేశరాజధాని న్యూ ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో రాష్ట్రపతి సమక్షంలో జరగనున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఇది రెండో గణతంత్ర దినోత్సవ వేడుకలు. భారత సైన్యంలోని వివిధ దళాలు మార్చ్ ఫాస్ట్ నిర్వహించనున్నాయి.
గౌరవ అతిథి ఎవరు?
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరౌతారు. శుక్రవారమే ఆయన రెండు రోజుల పర్యటన ప్రారంభమవుతుంది. రమఫోసాతో పాటు మొదటి మహిళ డాక్టర్ త్సెపో మోట్సెపి, తొమ్మిది మంది మంత్రులు, 50 మంది వ్యాపారవేత్తలు వేడుకల్లో పాల్గొంటారు. నెల్సన్ మండేలా తర్వాత రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా వస్తున్న రెండో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా.
గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతసేపు?
ఇండియా గేట్ దగ్గర అమర జవాన్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుష్పగుచ్ఛాలు సమర్పించిన తర్వాత వేడుకలు ప్రారంభమౌతాయి. న్యూ ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో రాష్ట్రపతి సమక్షంలో 70వ రిపబ్లిక్ డే వేడుకలు 90 నిమిషాలు జరుగుతాయని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
బాలలకు అవార్డులు:
జాతీయ అవార్డులు పొందిన 26 మంది పిల్లలను ఓపెన్ టాప్ జీపులో ఊరేగిస్తారు. ఢిల్లీ స్కూళ్ల నుంచి 3 బృందాలు, ఈస్టర్న్ జోన్ కల్చరల్ సెంటర్ నుంచి ఒక బృందం ఈవెంట్‌లో పాల్గొంటాయి. ప్రతీ గ్రూపు రాజ్‌పథ్‌లోని వేదికపై రెండు నిమిషాలు ప్రదర్శన ఇస్తుంది.