ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం : జగన్ 

  • Publish Date - March 30, 2019 / 03:52 PM IST

అనంతపురం : అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ అన్నారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మడకశిరలో ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని తెలిపారు. 

చంద్రబాబుకు ఓట్లు అడిగే ధైర్యం లేకనే ఢిల్లీ నుంచి నాయకులను తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మోసం తప్ప ఏం జరుగలేదన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసే అబద్దపు వాగ్ధానాలకు మోసపోవద్దని కోరారు. మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ కోసం.. రూ.250 కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులను రాజశేఖర రెడ్డి పూర్తి చేశారు. మిగిలిన 20 శాతం పనులు కూడా చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో పూర్తి చేయలేదని విమర్శించారు. 

మడకశిరలో తాగు నీటి సమస్య ఎక్కువగా ఉందని ధర్నాలు చేస్తున్నా పట్టించుకోలేదన్నారు. సీఎం హోదాలో ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. పరిశ్రమలు పెట్టిస్తానన్నారని… ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? డిగ్రీ కాలేజీలు కట్టించాడా? మడకశిరలో 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేస్తానన్నాడు… చేశాడా? ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తానన్నాడు… నిర్మించాడా? అని ప్రశ్నించారు.
 

ట్రెండింగ్ వార్తలు