నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీలకు రావొద్దంటూ వాళ్ల కాళ్లు పట్టుకుని ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారు.
నిజామాబాద్ జిల్లాలో సమ్మెలో భాగంగా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీలకు రావొద్దంటూ వాళ్ల కాళ్లు పట్టుకుని ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారు. మరికొందరు పూలగుచ్ఛాలు ఇస్తూ సమ్మెకు సహకరించాలని కోరారు. విధ్వంసాలు చేయకుండా శాంతియుతంగా గాంధీగిరి తరహాలో నిరసన ప్రదర్శన చేపట్టారు. మరోవైపు డిపోల వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎక్కడికక్కడ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు..
వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఆర్టీసీ కార్మికులు డిపో ముందు ధర్నా చేపట్టారు. ఉదయం నాలుగు గంటలకే గేటు ముందు కూర్చొని నిరసన చేశారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు బస్సులు నడపొద్దంటూ, తమ కడుపు కొట్టొద్దంటూ చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకుని బస్సులను బయటికి పంపించారు.