సంగారెడ్డి జిల్లాకు మరో జాతీయ అవార్డు

సంగారెడ్డి జిల్లాకు జాతీయ పోషణ్ అవార్డు అందిన రోజుల వ్యవధిలోనే మరో జాతీయ అవార్డు దక్కింది. జాతీయ స్థాయిలో జిల్లా గౌరవం మరింత పెంపెందేలా నిలిచింది. ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యతా పరమాణాలు పెంచినందుకుగాను సంగారెడ్డి, జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రలకు జాతీయ ఆరోగ్య మిషన్ లక్ష్య అవార్డు దక్కింది. 300 అంశాలపై సమీక్షా సమావేశాలు, నాణ్యతా ప్రమాణాలు పెంచినందుకుగాను జహీరాబాద్ ఆసుపత్రికి 97శాతం, సంగారెడ్డి ఆసుపత్రికి 93శాతం మార్కులు వచ్చాయి. 

దేశవ్యాప్తంగా ఆసుపత్రుల పనితీరుపై సంతృప్తి చెందిన జాతీయ ఆరోగ్య మిషన్ ఈ అవార్డును అందించనుంది. ఈ అవార్డు పొందిన ఆస్పత్రులకు మూడేళ్ల పాటు లేబర్ రూమ్ కు, ఆపరేషన్ థియేటర్ కు రూ.3లక్షల చొప్పున అందించనున్నారు. ఈ నెల 23న కలెక్టర్ హనుమంతరావు, జిల్లా అధికారులు జాతీయ పోషన్ అభియాన్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. 

పోషణ్ అభియాన్ కింద 2018-19 సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లాగా సంగారెడ్డి ఎంపికైన సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ నుంచి జిల్లాలో పోషణ్ అభియాన్ కార్యక్రమం ప్రారంభమైంది. పోషణ లోపం లేని సమాజ నిర్మాణం కోసం కలెక్టర్ హనుమంతరావు జిల్లాలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పోషణపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. క్షేత్ర స్థాయిలో ప్రజలన్ని చైతన్యం చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా పంచాయతీ, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఇమ్యూనైజేషన్ శాఖల సమన్వయంతో కలెక్టర్ చేసిన కృషి ఫలించింది.