చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు జాబు రాలేదని.. లోకేష్ కు ఏకంగా మూడు ఉద్యోగాలు ఇచ్చారని షర్మిల అన్నారు.
ప.గో : చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు జాబు రాలేదని.. ఆయన కొడుకు లోకేష్ కు ఏకంగా మూడు ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల అన్నారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారని ప్రశ్నించారు. ఏ అర్హత, ఏ అనుభవం ఉందని లోకేష్ కు మూడు మంత్రి పదవులు ఇచ్చారని నిలదీశారు. దెందులూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో షర్మిల ప్రసంగించారు.
పసుపు-కుంకుమ.. మహిళలపై ప్రేమతో ఇవ్వడం లేదన్నారు. ఐదేళ్లలో ఇవ్వని పసుపు-కుంకుమ ఇప్పుడిస్తున్నారంటే అది ఎన్నికల జిమ్మిక్కేనని తెలిపారు. చంద్రబాబు పొడిచేస్తాడు, చించేస్తాడని అధికారం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. అమరావతికి కేంద్రం నిధులు ఇచ్చానంటే, చంద్రబాబు ఇవ్వలేదని చెప్తున్నారని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఎవరి జేబుళ్లోకి వెళ్లినట్లని ప్రశ్నించారు.
చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి అని విమర్శించారు. హోదా విషయంలో చంద్రబాబు ఎందుకు యూటర్న్ తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నిజం మాట్లాడితే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందనే శాపం ఉందన్నారు. అందుకే చంద్రబాబు నిజాలు మాట్లాడాలంటే భయపడుతున్నారని తెలిపారు. టీడీపీ అభ్యర్థులు ప్రచారానికి వస్తే అమలు హామీల గురించి అడగాలని ప్రజలకు సూచించారు. వైసీపీకి.. బీజేపీ, టీఆర్ఎస్ తో పొత్తులున్నాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ పొత్తు లేకుండా ఏనాడైనా చంద్రబాబు పోటీ చేశారా ప్రశ్నించారు షర్మిల.