tik tok వీడియోల కోసం ఫీట్లు చేసి పలువురు ప్రాణాలమీదికి తీసుకొచ్చన ఘటనల గురించి ఇప్పటి వరకూ విన్నాం..చూశాం. tik tok వీడియోలు చేసిన ఉద్యోగాలు పోగొట్టుకున్నవారిని కూడా చూశాం. కానీ tik tok వీడియో తండ్రీ కొడుకులను కలిపిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది. టిక్ టాక్ వీడియోలు చేసే ఓ వ్యక్తి అదే టిక్ టాక్ వీడియోలో గత కొంతకాల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోన తన తండ్రిని కనిపెట్టాడు. ఆరు సంవత్సరాల క్రితం కొన్ని గొడవల కారణంగా ఇల్లు విడిచి వెళ్లిపోయిన తండ్రి గుజరాత్‌లో ఉన్నాడని tik tok వీడియో ద్వారా తెలుసుకున్న ఇద్దరు కొడుకుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తరువాత తండ్రి గుజరాత్ లో ఉన్నాడని తెలుసుకుని ఇద్దరు కొడుకులు తండ్రిని ఇంటికి తీసుకురావటానికి గుజరాత్ వెళ్లారు.
వివరాల్లోకి వెళితే..కర్నూలు జిల్లా నంద్యాల హరిజనవాడలో నివసిస్తున్న అనుపూరి పుల్లయ్య ఆరు సంవత్సరాల క్రితం ఇంటిని వదిలివెళ్లిపోయాడు. దీంతో పుల్లయ్య కోసం కొడుకులు వెదకని ప్రాంతమంటూ లేదు. కానీ తండ్రి జాడ దొరకలేదు. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానించారు. ఎంతకీ అతను రాకపోవటంతో చనిపోయుంటాడనీ..లేకుంటా కోపంతో వెళ్లిన వ్యక్తి ఇప్పటి వరకూ రాకపోవటమేంటి అంటూ బంధువులు పదే పదే అనటంతో పుల్లయ్య కొడుకులు నిజంగానే తమ తండ్రి చనిపోయాడేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో చనిపోయినవారికి చేసినట్లుగా పుల్లయ్య కొడుకులు కర్మకాండలను కూడా చేసేశారు. అంతేకాదు ప్రతీ సంవత్సరం పుల్లయ్యకు కొడుకులు పిండం పెడుతున్నారు కూడా.
బంధువుల పోరు పడలేక తండ్రికి కర్మకాండలు జరిపించినా తండ్రి బ్రతికేఉన్నాడని ఆశతో పుల్లయ్య కొడుకు నరసింహులు తండ్రి కోసం వెతకటం మానలేదు. తెలిసినవారిని తెలియనివారికి కూడా అడుగుతున్నాడు. కనిపించటంలేదు అంటూ ప్రకటనలు ఇస్తూనేఉన్నాడు.
అలా చేసిన నరసింహులుకు ఓ ఐడియా వచ్చింది. అదే tik tokను సాధనంగా వాడుకోవాలనుకన్నాడు. అనుకున్నదే తడవుగా టిక్ టాక్ వీడియోల ద్వారా తన తండ్రి కనిపిస్తే చెప్పాలంటే వేడుకున్నాడు. సోషల్ మీడియా ప్రియులు కూడా నరసింహులును వీడియోను షేర్ చేస్తూనే ఉన్నారు. అనుకున్నట్లు గానే నరసింహులు ఆశ ఫలించింది. నరసింహులు షేర్ చేసిన వీడియోను చూసిన ఓ tik tok ప్రియుడు పుల్లయ్య గుజరాత్ లో ఉన్నట్లుగా నరసింహులికి సమాచారం ఇచ్చాడు. వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు నరసింహులుకు తండ్రి పుల్లయ్య దొరికాడు. టిక్ టాక్ ద్వారా తండ్రిని కొడుకు నరసింహులు గుర్తించాడు. దీంతో నరసింహులు పట్టరాని సంతోషంలో మునిగితేలాడు. తండ్రి గుజరాత్‌లో ఉన్నట్లు తెలుసుకున్న కొడుకు ఆగమేఘాల మీద అక్కడకు వెళ్లాడు. గుజరాత్‌లో ఉన్న తండ్రిని నరసింహులు నంద్యాలకు తీసుకురానున్నాడు.
ఆరు సంవత్సరాల తరువాత పుల్లయ్య క్షేమంగా ఇంటికి వస్తున్నాడని కుటుంబసభ్యులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ విషయం చుట్టుపక్కలవారికి..బంధువులకు..స్నేహితులకు తెలియటంతో పుల్లయ్య కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు నంద్యాల ప్రజల దృష్టి అంతా పుల్లయ్య ఇంటిపైనే ఉంది. tik tok ద్వారా చేడే కాదు అప్పడప్పుడు మంచిపనులు కూడా జరుగుతుంటాయని ఈ ఘటన నిరూపించింది.tik tok ద్వారా తండ్రికి కనిపెట్టిన నరసింహులిని అందరూ ప్రశంసిస్తున్నారు.