తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎండ వేడికి వడగాలులు
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎండ వేడికి వడగాలులు తోడయ్యాయి. దీంతో జనాలు విలవిలలాడిపోతున్నారు. ఉదయం 8 నుంచే ఎండ తీవ్రత కనిపిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య రోడ్డు మీదకి రావడానికి జనాలు సాహసం చెయ్యడం లేదు. పట్టణాలు, నగరాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి.
సోమవారం (మే 6, 2019) రాష్ట్రంలో అత్యధికంగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఖమ్మంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నల్లగొండలో 45 డిగ్రీలు.. ఆదిలాబాద్, భద్రాచలం, నిజామాబాద్, రామగుండంలలో 44 డిగ్రీలు.. మహబూబ్ నగర్, మెదక్ లలో 43 డిగ్రీలు.. హన్మకొండ, హైదరాబాద్ లో 42 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడ ఇక్కడా అని కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అన్ని చోట్ల 42 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి.
ముందు ముందు ఎండలు మండిపోతాయని చెప్పారు. రానున్న రోజుల్లో 47 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. మే మొత్తం ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెలలో వడగాలుల తీవ్ర ఎక్కువగా ఉంటుందన్నారు. వచ్చే 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చాలా కేర్ ఫుల్ గా ఉండాలన్నారు. తగినంత నీరు తీసుకోవాలని సూచించారు. బయటికి వెళ్లే సమయంలో మంచి నీళ్ల బాటిల్ దగ్గర పెట్టుకోవాలన్నారు. ఎండ తగలకుండా గొడుగులు, క్యాప్స్ వంటిని పెట్టుకోవాలన్నారు.