తాడేపల్లి గూడెంలో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఎస్వీఆర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన 9 అడుగుల 3 అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. 2019, అక్టోబర్ 06వ తేదీ ఉదయం జరిగింది ఈ కార్యక్రమం. మెగాస్టార్ రావడంతో పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. చిరును చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో చిరు..గన్నవరం విమానాశ్రాయనికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం రోడ్డు మార్గం గుండా..తాడేపల్లి గూడెం చేరుకున్నారు. రోడ్లకిరువైపులా భారీగా అభిమానులు పోటెత్తారు. వీరికి అభివాదం చేస్తూ ముందుకెళ్లారు చిరు. అనంతరం భారీ జనసందోహం వద్ద ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. చిరు రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. తాను ఇండస్ట్రీ వచ్చేసరికి ఎస్వీఆర్ స్వర్గస్తులయ్యారని, ఆయన ఒకవేళ ఉంటే..సైరా సినిమా చూసి శభాష్ అని అంటుంటే ఎంత బాగుండేదన్నారు. ఆ మహానటుడి ఆశీస్సులు ఉంటాయన్నారు. ఆయన
ఎన్నో రోజుల నుంచి ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరింప చేయాలని అనుకున్నా..కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎస్వీఆర్ సేవా సమితి సభ్యులు గతంలోనే చిరును కలిసి..విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా కోరారు. కానీ పోస్ట్ పోన్డ్ అయ్యింది. ఎట్టకేలకు విగ్రహం ఆవిష్కరణం కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి నటించిన సైరా ఉయ్యాల వాడ నరసింహారెడ్డి సినిమా ఘన విజయం సాధించింది. అక్టోబర్ 02వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది.
చిరు నటనకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో సినిమా రిలీజ్ అయ్యింది. ఇది చరణ్ చేసిన సాహసమే. ఈ సినిమాలో మెగాస్టార్‌తోపాటు బాలీవుడ్ నుంచి బిగ్ బీ అమితాబ్.. కోలీవుడ్ నుంచి స్టార్ హీరో విజయ్ సేతుపతి, కన్నడ ఫేమస్ హీరో సుధీప్ నటించారు.. వీరితోపాటు జగపతి బాబు.. నయనతార, తమన్నా.. ఇలా మల్టీ లాంగ్వేజ్ స్టార్స్‌తో సినిమాను రూపొందించారు. ఇంత పెద్ద ప్రాజక్ట్‌ను కూల్‌గా హ్యాండిల్ చేసి.. మెగాస్టార్ చేత బెస్ట్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు
ఎస్వీఆర్ విషయానికి వస్తే…ఈయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 1918, జులై 03న జన్మించారు. 1974, జులై 18న మరణించారు. నూజివీడులో జన్మించిన రంగారావు..మద్రాసు, ఏలూరు, విశాఖలో విద్యభ్యాసం చేశారు. చదువుకొనే రోజుల్లో నాటకాల్లో నటించేవారు. ఫైర్ ఆఫీసర్‌గా కొద్ది రోజులు జాబ్ చేశారు. నటనపై దృష్టి మళ్లడంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వరూధిని చిత్రంలో తొలిసారిగా నటించారు. ఈ సినిమా అంతగా ఆడలేదు. దీంతో ఛాన్స్‌లు రాలేవు. తెలుగు, తమిళ, కన్నడ మలయాళ, హిందీ భాషల్లో 300కి పైగా చిత్రాల్లో నటించారు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ సినిమాలు ఎస్వీఆర్‌కు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. నర్తనశాలలో ఆయన నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారం లభించింది. విశ్వనట చక్రవర్తి, నట సౌర్వభౌమ, నటసింహ బిరుదులు లభించాయి.