TDP కంచుకోటలో చీలిక.. ఇద్దరి నిర్లక్ష్యమే దీనంతటికీ కారణం

టీడీపీ ఆవిర్భావం తర్వాత ఏడుసార్లు ఎన్నికలు జరిగితే ఆరుసార్లు టీడీపీ విజయం సాధించింది అక్కడ. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అనడంలో నో డౌట్. 1999లో ఒక్కసారి మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 1955లో ఏర్పడ్డ నియోజకవర్గం మొదట్లో జనరల్ కేటగిరీలో ఉండేది. 2009లో పునర్విభజన తర్వాత కొవ్వూరు ఎస్సీ రిజర్వుడు స్థానంగా మారింది. 

ఆ తర్వాత టీవీ రామారావు మొదటి సారి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచే గెలుపొందారు. తర్వాత 2014 ఎన్నికల్లో కొత్త వ్యక్తి అయినా జవహర్ ఈజీగా గెలిచారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ టీడీపీకి ఎంత బలం ఉందో. ఇక్కడ నాయకులు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో. కానీ 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందింది. టీడీపీ హవాకు వైసీపీ గండి కొట్టింది. 2014 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయిన జవహర్‌ను కాదని, పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న వంగలపూడి అనితకు సీటు ఇచ్చింది టీడీపీ అధిష్టానం. 

జవహర్ మంత్రిగా ఉన్నా గెలుపు కష్టమని సొంత ప్రాంతమైన కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి పంపేశారు. 2019 ఎన్నికల్లో ఇద్దరూ పోటీ చేసిన నియోజకవర్గాల నుంచి ఓడిపోయారు. అంతా బాగానే ఉన్నా ఇప్పుడు అసలు సమస్య వచ్చి పడింది. 

నియోజకవర్గాలను ఖాళీ చేసి:
2019 ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాజీ మంత్రి జవహర్‌ను, కొవ్వూరు నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా అనితను టీడీపీ అధిష్టానం నియమించింది. ఆయా నియోజకవర్గాల్లో ఇద్దరు నేతలు ఓటమి చెందినప్పటికీ వారి నియోజకవర్గాల్లో నెల రోజులు పాటు హడావుడి చేశారు. వంగలపూడి అనిత తన కుమార్తె ఓణీల ఫంక్షన్‌ను అత్యంత ఘనంగా కొవ్వూరులో నిర్వహించి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తాను ఇక్కడే ఉంటాను అనే సంకేతం ఇచ్చినా నెల తర్వాత కొవ్వూరును వదిలేశారు. మరోవైపు జవహర్ తిరువూరు వైపుకే రావడం లేదట. 

పట్టించుకోవడం లేదు:
జవహర్ ఇప్పుడు పూర్తిగా కొవ్వూరు నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనిత కొవ్వూరు వైపు కన్నెత్తి చూడకుండా విశాఖలో ఉంటూ అమరావతి వెళ్తున్నారు. కనీసం దారిలో ఉన్న నియోజకవర్గానికి ఒక్కసారి కూడా వచ్చిన పాపాన పోలేదు. ఇద్దరు నేతలు ఇన్‌చార్జ్ భాద్యతలిచ్చిన నియోజకవర్గాలను వదిలేసి వేరే చోట ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లోని తెలుగు తమ్ముళ్లు వీరిపై గుర్రుగా ఉన్నారట.

తెలుగు తమ్ముళ్లలో చీలిక:
మరో వైపు ఇదే తంతు కొవ్వూరులో కూడా కనిపించడం వంగలపూడి అనిత వైజాగ్‌కే పరిమితం అయ్యారు. దీంతో కొవ్వూరులో టీడీపీ సమస్యలు ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు. కొవ్వూరులో జవహర్ తిష్టవేసినా టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఆయనకు సరైన సహకారం దొరకడం లేదంట. దీంతో ఇప్పుడు కొవ్వూరు తెలుగు తమ్ముళ్ల పరిస్థితి దారుణంగా తయారైందని అందరూ అనుకుంటున్నారు. 

గందరగోళం సృష్టిస్తుంది వారిద్దరే: 
అటు అనిత, ఇటు జవహర్ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న నియోజకవర్గాలకు న్యాయం చేయకపోగా, వేరే నియోజకవర్గాల్లో పాగా వేసి కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకోకపోతే పార్టీ తీవ్రంగా నష్టపోవడం ఖాయమని చెవులు కొరుక్కుంటున్నారు.