రాజధాని అమరావతికి భూములిచ్చి రైతుల్ని సీఎం జగన్ అండ్ గ్యాంగ్ దొంగలుగా చూస్తున్నారనీ..రైతుల్ని అవమానపరుస్తున్నారనీ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. కేబినెట్ మీటింగ్ పేరుతో అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లోను అప్రకటిత ఎమర్జన్సీని విధించారనీ మండిపడ్డారు. రైతుల ఇంటికి నోటీసులు అంటించటం జగన్ నిరంకుశత్వానికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాజ్యాంగం ప్రకారంగా ఏపీకి ఏర్పడిన రాజధాని అమరావతి ఎలా మారుస్తారని ప్రశ్నించారు. మూడు రాజధానులు అంటూ ఇష్టారాజ్యంగా ప్రకటించేసి ఏకపక్ష నిర్ణయాలతో ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నారని విమర్శించారు. జగన్ తన స్వార్థం కోసం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించారనీ..గత ఏడు నెలల నుంచి ఉడా గ్రేటర్ విశాఖ పరిధిలో కొనుగోళ్లు అయి భూముల వివరాలు తెలపాలని యనమల డిమాండ్ చేశారు.
ఉత్తరాంధ్రను దోపిడీకి కేంద్రంగా చేసుకునేందుకు సీఎం జగన్ పక్కా ప్లాన్ ప్రకారంగా కుట్ర పన్నారనీ అందుకే విశాఖను క్యాపిటల్ గా ప్రకటించారని యనమల ఆరోపించారు. ఇష్టారాజ్యంగా సీఎం జగన్ వ్యవహరిస్తుంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే జగన్ సహించలేకపోతున్నారనీ యనమల అన్నారు.