తహసీల్దార్ విజయారెడ్డి ఘటన మరువకముందే కడప జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. అయితే ఇక్కడ తహసీల్దార్ వేధింపులతో రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
తహసీల్దార్ విజయారెడ్డి ఘటన మరువకముందే కడప జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. అయితే ఇక్కడ తహసీల్దార్ వేధింపులతో రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోయాడు. కానీ రెవెన్యూ సిబ్బంది రైతును అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఓ ప్రాణం నిలిచింది.
ముంపు గ్రామమైన దత్తాపురంకు చెందిన ఆదినారాయణ అనే రైతు గ్రామంలో తల్లి పేరు మీదున్న మూడున్నర ఎకరాల భూమిని తన పేరు మీదకు మార్చి నష్ట పరిహారం చెల్లించాలని కొండాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో అనేక సార్లు విజ్ఞప్తి చేశాడు. ఏడాదిగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే రెవెన్యూ సిబ్బంది తన విజ్ఞప్తిని పెడచెవిన పెట్టడంతో మనస్థాపం చెందిన ఆదినారాయణ మంగళవారం (నవంబర్ 5, 2019) 3.30 గంటల సమయంలో తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు.
అయితే అక్కడే ఉన్న రెవెన్యూ సిబ్బంది వెంటనే అప్రమత్తమై చల్లని నీటిని తీసుకెళ్లి అతని ఒంటిపై పోశారు. రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండటం వల్ల ప్రమాదం తప్పింది. ఒక ప్రాణం నిలిచింది. రైతును పూర్తిగా నిర్బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని, బాధితున్ని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిస్థాయిలో సమాచారాన్ని రాబడుతున్నారు.