మందడంలో టెన్షన్ : ధర్నా చేస్తున్న మహిళలు అరెస్ట్..పలువురికి గాయాలు

  • Publish Date - January 3, 2020 / 08:47 AM IST

రాజధాని  అమరావతి గ్రామాల్లో సకల జనుల సమ్మె ఉద్ధృతంగా సాగుతోంది. దీంట్లో భాగంగా మందడంలో మహిళలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నేటి 17 రోజులుగా మహిళలు తమ నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు ధర్నా చేస్తున్న మహిళల్ని అడ్డుకున్నారు. దీంతో మందడంలో మహిళలకు..పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఈ క్రమంలో పోలీసులు ఓ వృద్ధ మహిళను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసుల్ని మహిళలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఒక మహిళ స్మృహ తప్పి పడిపోయింది. కొంతమంది మహిళలకు గాయాలు కూడా అయ్యాయి.  దీంతో అక్కడే ఉన్న మహిళలు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలపై మగ పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. పోలీస్ జులుం నశించాలి..సీఎం జగన్ డౌన్..డౌన్..మూడు రాజధానులు వద్దు..అమరావతి ఒక్కటే రాజధానిగా ముద్దు అంటూ నినాదాలు చేశారు.  పోలీసులకు రైతులకు జరిగిన ఘర్షణలో ఓ రైతు చేతిమీదకు పోలీస్ జీప్ ఎక్కేసింది. సదరు రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇటువంటి వాతావరణం మధ్య మందడంలో ఉద్రిక్తత నెలకొంది.