అమరావతిలో టెన్షన్ టెన్షన్ : పాదయాత్రకు సిద్ధమైన మహిళలు 

అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు రెడీ అయ్యారు.

  • Publish Date - January 10, 2020 / 04:23 AM IST

అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు రెడీ అయ్యారు.

అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని కోసం రైతులు, ప్రజల నిరసనలు కొనసాగిస్తున్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ.. 29 గ్రామాల రైతులు, ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో రాజధాని గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. 

మరోవైపు ఉద్దండరాయునిపాలెం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు మహిళలు నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు రెడీ అయ్యారు. రాజధాని గ్రామాల్లో భారీగా మోహరించారు. మరోవైపు రాజధాని అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో పూజలు నిర్వహించి అనంతరం పొంగళ్లను నైవేద్యంగా బెజవాడ దుర్గమ్మకు సమర్పించాలని మహిళలు నిర్ణయించారు. పోలీసులు అనుమతివ్వకున్నా.. దుర్గమ్మకు సారె సమర్పిస్తామని శపథం చేశారు. 

విజయవాడలో పాదయాత్రకు అనుమతి లేదని… 144 సెక్షన్‌, 30 యాక్ట్‌ అమలులో ఉందని పోలీసులు చెబుతున్నారు. 29 గ్రామాల ప్రధాన కూడళ్ళలో ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. ముందస్తుగా రైతు నాయకులను తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకుని నర్సరావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఇక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ…  టీడీపీ ఆందోళనలను మరింత పెంచుతోంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రజా చైతన్య యాత్రను నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచీ మొదలయ్యే బస్సు యాత్ర… తాడేపల్లి గూడెం, తణుకు, రాజమండ్రి వరకూ సాగనుంది. ఆ తర్వాత కోటిపల్లిలో చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొనున్నారు. 

ప్రజా చైతన్య యాత్ర నేపథ్యంలో ముందస్తు అరెస్టులకు పోలీసులు సిద్ధమయ్యారు. నిరసన కార్యక్రమంలో పాల్గొకుండా టీడీపీ నేతలను గృహ నిర్భంధం చేస్తున్నారు. కృష్ణ, ప్రకాశం, గోదావరి జిల్లాల్లో ప్రజా సంఘాలు, రాజకీయ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, విజయవాడలో తెలుగు యువత యువత అధ్యక్షుడు దేవినేని చందులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 

ఇటు ప్రకాశం జిల్లాలో నిర్వహించనున్న ఆందోళనల్లో.. టీడీపీ నేత లోకేశ్ పాల్గొనున్నారు. అద్దంకి బస్టాండ్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే నిరసనా కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.