అనంతపురం జిల్లా కందుకూరు పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ నాయకుడు శివారెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురు వ్యక్తులు ఓటు వేయడానికి వచ్చారు. పోలీస్ బందోబస్తుతో ఓటు వేసేందుకు కందుకూరులోని పోలింగ్ బూత్ కు వచ్చారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నిందితులు గ్రామానికి రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వారిని ఊరిలోకి ఎలా తీసుకొస్తారని పోలీసులను ప్రశ్నిస్తున్నారు.
సంవత్సరం క్రితం జరిగిన శివారెడ్డి హత్య కేసులో నలుగురు అన్నదమ్ములు నిందితులుగా ఉన్నారు. గ్రామ బహిష్కరణకు గురయ్యారు. అయితే పోలీసుల బందోబస్తు నడుమ ఓటు వేసేందుకు వచ్చారు. దీంతో గ్రామస్తులు ఆవేదనకు గురయ్యారు. గ్రామ బహిష్కరణకు గురైన వ్యక్తులను పోలీస్ బందోబస్తుతో ఓటు వేయడానికి ఎలా తీసుకొస్తారని ప్రశ్నిస్తున్నారు.
నిందితులు వచ్చిన వాహనాన్ని గ్రామస్తులు ధ్వంసం చేశారు. నలుగురు నిందితులు ప్రాణ భయంతో పోలింగ్ బూత్ లోనే ఉండిపోయారు. పోలీసులు ఉన్నా బయటికి రాని పరిస్థితి నెలకొంది. నిందితులు బయటికి వస్తే వారిని చంపేందుకు కూడా వెనుకాడని స్థితిలో గ్రామస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా కవరేజ్ కు వచ్చిన రిపోర్టర్ల సెల్ ఫోన్స్, కెమెరాలు లాక్కుని, వీడియో తీయవద్దంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉద్రిక్తత నెలకొంది.