దసరా నవరాత్రులు ఘనంగా జరుపుకునే ప్రదేశాలివే

  • Publish Date - September 27, 2019 / 08:05 AM IST

భారతదేశంలో ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి. ఈ పండుగనే విజయదశమి అని కూడా పిలుస్తారు. ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్క విధంగా జరుపుకుంటారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో దసరా అంటే.. రామాయణంలో రావణుడిపై శ్రీరాముడి విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. అలాగే తూర్పు, ఈశాన్య దసరా అంటే.. రాక్షసుల రాజు మహిషాసురిడి పై దుర్గమ్మ సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. ఇలా దేశవ్యాప్తంగా వేరు వేరు ఆచారాలను పాటిస్తున్నా.. వారందరి సందేశం ఒక్కటే అని చెప్పొచ్చు. చెడు ఎప్పటికీ గెలవదు అని అర్ధం.

మైసూర్ నగరంలో దసరా పండుగ చాలా ఘణంగా జరుపుకుంటారు. దసరా వస్తుందంటే చాలు కర్ణాటక అంతా సందడే సందడి. మైసూర్‌ లో జరిపే దసరా వేడుకలకు 500 ఏళ్లనాటి చరిత్ర ఉంది. ఇక్కడి దసరా వేడుకలను చూసేందుకు దేశవిదేశాల నుంచి ప్రజలు తరలివస్తారు. అంతేకాదు, దీని చరిత్ర గురించి గొప్పగా చెప్పుకుంటారు. మైసూర్ మాత్రమే కాదు పశ్చిమబెంగాల్, ఒడిషా, రామ్‌లీలా మైదాన్, గుజరాత్, వారణాసి, కులులోయ, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో కూడా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుతారు.

ఇక విజయవాడలో అయితే దసరా సంబరాలు అంబరాన్నంటుతాయి. నవరాత్రుల వేడుకల్లో దుర్గమ్మను తొమ్మది రోజులపాటు.. ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి ఊరేగుస్తారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా వీరవాసంలో వంద సంవత్సరాల నుంచి ఏనుగుల సంరంభం జరపడం ఆనవాయితీగా వస్తోంది. వెదురు కర్రలు, గడ్డి, కొబ్బరి పీచుతో చేసిన ఏనుగును అంబారీతో చూడముచ్చటగా అలంకరిస్తారు. ఈ ఊరేగింపులో పిల్లలను ఏనుగు కింది నుంచి దూరనిస్తారు. ఇలా చేస్తే పిల్లలకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయని విశ్వసిస్తారు.