ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. వెంటనే సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని పిటిషినర్లు కోరారు.
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. వెంటనే సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని పిటిషినర్లు కోరారు. దీంతో హైకోర్టు ప్రభుత్వానికి, కార్మిక సంఘాలకు నోటీసులు జారీ చేసింది. అన్ని పిటిషన్లపై ఈనెల 28న వాదనలు వింటామని తెలిపింది. ఇప్పటికే దాఖలైన పిటిషన్లపై గతంలో విచారణను హైకోర్టు 28కి వాయిదా వేసింది. వాటితో పాటు కొత్త పిటిషన్లను విచారించనుంది.
ఆర్టీసీ కార్మికుల సమ్మె 17 వ రోజు కొనసాగుతోంది. కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం, అటు కార్మిక సంఘాలు పట్టువీడటం లేదు. కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినా అందుకు సుముఖంగా లేదు. సమ్మె విరమిస్తేనే చర్చలు జరుపుతామని ప్రభుత్వం తెగేసి చెబుతోంది. అటు కార్మికులు సైతం తమ డిమాండ్ల పరిష్కారానికి ఆమోదం తెలిపితే గానే సమ్మె విరమణ లేదంటున్నారు.
సమ్మెతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ బస్సులను నడుపుతోంది. సరిపడా బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ్టి నుంచి విద్యాలయాలు ఓపెన్ అయ్యాయి కనుక మరిన్ని సమస్యలు తలెత్తనున్నాయి.