అమరావతి రాజధాని అనే అంశంపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సిద్ధమైంది. ఓ వైపు 3రాజధానుల నిర్ణయం దిశగా వైసీపీ మొగ్గు చూపుతుంటే మరోవైపు రాజధానిని మార్చేది లేదని టీడీపీ ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్లాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. వెళ్లబోయే ముందు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాట్లాడారు.
‘ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. రాష్ట్రమంతా ప్రజలకు అసౌకర్యం కల్పించే విధంగా ఉంది. 33రోజులుగా రాష్ట్రమంతా ప్రజలంతా రోడ్లమీదకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీనిని అనుమతించేందుకు వీల్లేదు. వందల మందిని అరెస్టు చేస్తున్నారు. ఇళ్లల్లో, రోడ్ల మీదా రాష్ట్రమంతటా అరెస్టులు జరుగుతున్నాయి. కర్ఫ్యూ విధించారు. ఇదొక పిరికిపంద చర్య. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అప్పుడు కూడా ఇంత బందోబస్తు లేదు’
‘రాష్ట్రమంతా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇది ప్రజాస్వామ్యం కాదు. వీళ్లందరికీ ఇదే హెచ్చరిస్తున్నాం. చరిత్రలో ఇలాంటి దారుణాలు ఎప్పుడూ జరగలేదు. నిజానికి చెప్పాలంటే ఇదొక బ్లాక్ డే. దీనిని మేము అసలు సహించం’ అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.