జీతాలు పెంచుతారా : టీటీడీ పాలకమండలి సమావేశంపై ఆశలు

టీటీడీ నూతన పాలకమండలి మరోసారి సమావేశం కాబోతోంది. సెప్టెంబర్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు తొలి సమావేశం జరిగినా అనేక కీలక నిర్ణయాలు వాయిదా పడ్డాయి.

  • Publish Date - October 17, 2019 / 06:02 AM IST

టీటీడీ నూతన పాలకమండలి మరోసారి సమావేశం కాబోతోంది. సెప్టెంబర్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు తొలి సమావేశం జరిగినా అనేక కీలక నిర్ణయాలు వాయిదా పడ్డాయి.

టీటీడీ నూతన పాలకమండలి మరోసారి సమావేశం కాబోతోంది. సెప్టెంబర్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు తొలి సమావేశం జరిగినా అనేక కీలక నిర్ణయాలు వాయిదా పడ్డాయి. బ్రహ్మోత్సవాలు విజయవంతమవడంతో నూతనోత్సాహంతో ఉన్న పాలకమండలి సభ్యులు రెండవ సమావేశానికి సిద్ధమవుతున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

టీటీడీ పాలకమండలి సమావేశం అక్టోబర్ 23న తిరుమలలో జరగనుంది. చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరగనున్న రెండవ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా టీటీడీలోని అన్ని విభాగాల్లో 11 వేల మందికిపైగా కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారు. చాలీచాలని జీతాలతో ఏళ్ల తరబడి కుటుంబాలను నెట్టుకొస్తున్న ఆ కాంట్రాక్ట్ కార్మికులందరూ వేతనాల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ సమావేశంపై ఆశలు పెట్టుకున్నారు. వారికి… టైమ్‌ స్కేల్ ప్రకటిస్తారా లేదంటే జీతాలు పెంచుతారా అన్నది టీటీడీ బోర్డు మీటింగ్‌లో తేలిపోనుంది.

గత సమావేశంలోనే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారంపై ఛైర్మన్ దృష్టిసారించారు. అయితే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను గుర్తించి లోతుగా చర్చించడానికి పాలకమండలి సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయనం చేసి పాలకమండలికి సమర్పిస్తుంది. ఆ తర్వాత పాలకమండలి నిర్ణయం తీసుకోనుంది. 

శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చే దాతలకు ప్రొటోకాల్ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే టీటీడీ ఈవో స్పష్టత కూడా ఇచ్చారు. త్వరలో జరిగే పాలకమండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుని ఛైర్మన్ స్వయంగా ప్రకటించే అవకాశం ఉంది. తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గరుడవారధికి నిధుల కేటాయింపుపైనా చర్చించనుంది. దీనిపై ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని గత సమావేశంలోనే ఛైర్మన్ వెల్లడించారు. గరుడ వారధికి నిధుల కేటాయింపుపై అనుకూలంగా ఓ వర్గం… వ్యతిరేకంగా మరో వర్గం ఆందోళనలు చేపడుతున్న దృష్ట్యా… దీనిపై టీటీడీ బోర్డు క్లారిటీ ఇవ్వనుంది. మరోవైపు… తిరుమలలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు నిర్మించతలపెట్టిన బాలాజీ రిజర్వాయర్‌ అంశం కూడా చర్చకు రానుంది.