ఆభరణాల మాయంపై టీటీడీ ఈవో వివరణ

  • Publish Date - August 27, 2019 / 03:16 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆభరణాల మాయంపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివరణ ఇచ్చారు. రెండు బంగారు ఉంగరాలు, రెండు బంగారు నెక్లెస్ లు, ఒక బంగారు నాణెం, ఒక వెండి కిరీటం మాయం అయ్యాయని తెలిపారు. రికార్డుల్లో ఉన్న వెండి కంటే అదనంగా వెండి వస్తువులు గుర్తించామన్నారు. అప్పటి ట్రెజరీ ఏఈవో శ్రీనివాసులును బాధ్యులుగా గుర్తించామని చెప్పారు. ఆయన జీతం నుంచి రూ.7లక్షల 36 వేలు రికవరీ చేస్తామని చెప్పారు. 

ఏ అధికారి హయాంలో ఆభరణాలు మాయం అవుతాయో వారి నుంచి రికవరీ చేయడం టీటీడీ నిబంధన అన్నారు. మరోసారి ఆభరణాలు సరిచూసుకొని చర్యలు చేపడతామని చెప్పారు. సెప్టెంబర్ లో అన్ని ఆభరణాలను మళ్లీ తనిఖీ చేస్తామన్నారు. 

టీటీడీలో ట్రెజరీ నుంచి 5 కిలోల వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు, రెండు బంగారు నెక్లెస్ లు మాయమవ్వడం కలకలం రేపింది. తిరుమల శ్రీవారికి వచ్చిన ఆభరణాల లెక్కల్లో అవకతవకలు జరుగడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఏఈవో శ్రీనివాసులను బాధ్యుడిగా తేల్చి ఆభరణాల విలువకు సరిపడా డబ్బును అతని దగ్గర నుంచి ప్రతి నెల రూ.30వేల లెక్కన రికవరీ చేస్తున్నారు అధికారులు.
 

అయితే తప్పు చేస్తే చర్యలు తీసుకోకుండా రికవరీ చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఏఈవో శ్రీనివాసులును ఒక్కరినే ఎందుకు బాధ్యులను చేశారనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆభరణాలు ఎవరు తీశారో తేల్చకుండా కేవలం ఒక అధికారిని మాత్రమే బాధ్యుడిని చేసి రికవరీ చేస్తే సరిపోదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

దీని వెనక ఏదైనా కుట్ర ఉండి ఉండవచ్చుననే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ అధికారుల తీరు తరుచూ వివాదాలకు దారి తీస్తోండగా లేటెస్ట్ గా కిరీటం మాయమైన వ్యవహారం కూడా వివాదాలకు కారణం అవుతోంది. ఇప్పటికే గతంలో అనేకసార్లు ఆభరణాలు మాయం అవుతున్నాయని ఆరోపణలు వచ్చినా కూడా అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఈ విషయంలో భక్తులు కూడా టీటీడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

ట్రెండింగ్ వార్తలు