బుల్లి తెర ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మరో వర్ధమాన నటి ఆత్మహత్య చేసుకుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె అర్దాంతరంగా తనువు చాలించింది. ప్రేమ వ్యవహారమే కారణం అని తెలుస్తోంది. ప్రియుడితో గొడవలే ప్రాణం తీశాయని చెబుతున్నారు. వర్ధమాన టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య బుల్లి తెర ఇండస్ట్రీలో సంచలనం రేపింది. మా టీవీలో వచ్చే పవిత్ర బంధం సీరియల్‌లో ఝాన్సీ ఓ పాత్రలో నటిస్తోంది. 2019, ఫిబ్రవరి 5వ తేదీ మంగళవారం రాత్రి ఝాన్సీ తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని చనిపోయింది.
ఝాన్సీ బలవన్మరణం ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురి చేసింది. రంగుల ప్రపంచం వెనుక ఆర్టిస్టులు ఎదుర్కొనే సమస్యలను బహిర్గతం చేసింది. నటనలో జీవించే వారు.. నిజ జీవితంలో మాత్రం ఓడిపోతున్నారు. తెరమీద నవ్వుతూ కనిపించే వారి నిజ జీవితాల్లో సమస్యల కోణాన్ని బయటపెట్టింది. ఝాన్సీ మరణం బుల్లి తెర ఇండస్ట్రీలో చోటు చేసుకున్న గతాన్ని గుర్తు చేసింది. ఒక్క ఝాన్సీనే కాదు గతంలో కొందరు ఆర్టిస్టులు, న్యూస్ రీడర్లు ఇలానే అర్దాంతరంగా తనువు చాలించారు. లవ్ ఫెయిల్యూర్, ఆర్థిక సమస్యలు, దాంపత్య జీవితంలో గొడవలు, అనారోగ్య కారణాలు, పని ఒత్తిడి, డిప్రెషన్, ఒంటరితనం ఇలాంటి కారణాలతో గతంలో కొందరు ఆర్టిస్టులు సూసైడ్ చేసుకున్నారు. మరికొందరు అనుమానాస్పద స్థితిలో మరణించారు.
అర్పితా తివారి.. ముంబైకి చెందిన టీవీ ఆర్టిస్ట్. ఆమె మరణం ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురి చేసింది. అర్పితా శరీరంపై గాయాలను గుర్తించారు. గొంతునులిమి చంపేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. పలు సీరియల్స్‌లో నటించిన బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడి వివాహం టీవీ నటి పావని రెడ్డితో జరిగింది. పెళ్లయిన 4 నెలలకే కన్నుమూశాడు. ముందు రోజు బర్త్ డే పార్టీ జరిగింది. ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు శవమై కనిపించాడు. కోలీవుడ్ పాపులర్ నటి షబానా మరణం కూడా అనుమానాస్పదమే. ఉత్తరాదికి చెందిన వ్యక్తిని ఆమె రహస్యంగా పెళ్లాడింది. ఆ తర్వాత అకస్మాత్తుగా చనిపోయింది.
మల్లిక.. యాంకర్లు సుమ, ఝాన్సీతో సమానంగా గుర్తింపు పొందారు. జెమిని టివిలో ఎక్కువగా కనిపించారు. సినిమాల్లోనూ పలు పాత్రలో పోషించారు. 1997 నుంచి 2004వరకూ బిజీగా ఉన్నారు. ఎన్నో అవార్డులు అందుకున్న ఈమె కెరీర్ పీక్స్‌లో ఉండగానే విజయసాయి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని బెంగుళూరులో సెటిల్ అయ్యారు. వీరికి కృష్ణప్రసాద్ అనే కొడుకు ఉన్నాడు. అయితే 39వ ఏట మల్లిక మరణించారు. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లి చనిపోయారు.
భార్గవి.. తెలుగులో మంచి యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. అష్టా చెమ్మా మూవీలో నటించింది. ప్రేమ వ్యవహారం భార్గవి ప్రాణం తీసింది. బాయ్‌ఫ్రెండ్ ప్రవీణ్‌తో కలిసి విషం తాగి ఇద్దరూ మరణించారు. నటిగా బిజీ అవుతున్న ఆమెకు అతడితో అప్పటికే పెళ్లయినట్లు వార్తలొచ్చాయి. అయితే ప్రవీణ్ అలియాస్ బుజ్జికి రెండు పెళ్లిళ్లు అయ్యాయట. ఆర్కెస్ట్రా నిర్వాహకుడైన ప్రవీణ్ నెల్లూరు వాసి. భార్గవిది గుంటూరు జిల్లా గోరంట్ల.
ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ రాధిక జీవితం కూడా విషాదంగా ముగిసింది. భర్తతో గొడవలు, కుమారుడు మానసిక వైకల్యం తనను కుంగదీశాయని, అందుకే చనిపోతున్నా అంటూ ఆమె సూసైడ్ నోట్ రాసి మరీ మరణించింది. ఒంగోలుకు చెందిన టీవీ9 యాంకర్ కరీంపై హైదరాబాద్‌లో మర్డర్ అటెంప్ట్ జరిగింది. అతడి భార్య శిరీష తరుఫు బంధువులు కిరణ్, సాంబశివరావు, కృష్ణ కుమారి కరీంపై యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటనలో కరీం కళ్లు పోయాయి. టీవీ 9 న్యూస్ రీడర్‌గా తనకంటూ ఓ గుర్తింపు పొందిన జర్నలిస్టు బద్రీ… రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కారు టైర్ పంక్చర్ అవ్వడంతో వేగంగా చెట్టుని ఢీకొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
చెన్నైకి చెందిన సినీనటి ప్రియాంక జీవితం ఇలానే అర్ధాంతరంగా ముగిసింది. ఆమె ఆత్మహత్య చేసుకుంది. పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించిన ప్రియాంక ఆత్మహత్య చేసుకోవడం తమిళ సినీ పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. పెళ్లైన రెండేళ్లకే భర్తకు దూరమైంది. భర్తతో విభేదాలు, తల్లిదండ్రులు దూరంగా ఉండటంతో మెంటల్‌గా బాగా డిస్టర్బ్ అయ్యి సూసైడ్ చేసుకుందని పోలీసులు తేల్చారు.
ఇలా బుల్లి తెరపై అలరించిన ఎందరో అర్టిస్టులు పలు కారణాలతో అర్దాంతరంగా మరణించడం పరిశ్రమ వర్గాల్లో విషాదం నింపింది. తెరపై నవ్వుతూ కనిపించినా వారి మనసులో ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొన్నారు. సమస్యలను ఫేస్ చేయలేక కొందరు ప్రెజర్‌ను తట్టుకోలేక మరికొందరు.. ఒంటరితనం, దాంపత్య జీవితంలో గొడవలు, ఆర్థిక సమస్యలు, అవకాశాలు రాకపోవడంతో ఇంకొందరు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.