తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గోదావరి నదిలో పర్యాటక బోటు మునిగి పోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. లైఫ్ జాకెట్లు ధరించిన 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 49 మంది గల్లంతయ్యారు. బోటులో మొత్తం 61 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 50 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో పాపికొండలకు వెళ్తుండగా దేవీ పట్నం మండలం కచ్చులూరు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. పర్యాటకుల బోటుకు అనుమతి లేదని అధికారులు అంటున్నారు. రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి, సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
రాయల్ వవిష్ట బోటు ఎలాంటి అనుమతులు లేకుండానే నడుస్తోంది. ప్రైవేట్ ఆపరేటర్లు పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంత వరదలో అనుమతిలేని బోట్లు నడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రైవేట్ ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు మొద్దునిద్ర వీడడం లేదు.
బోటు ప్రమాదంపై సీఎం జగన్ ఆరా తీశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఘటనా స్థలికి బయల్దేరారు. ఈ ఘటన చాలా దురదృష్టకరం అన్నార. ప్రమాదానికి గురైంది టూరిజం బోటు కాదని… వశిష్ట ప్రైవేట్ బోటు అని తెలిపారు. ఆ బోటుకు ఎవరూ అనుమతి ఇవ్వలేదని చెప్పారు. టూరిజం శాఖ పర్మిషన్ ఇవ్వలేదని.. కాకినాడ పోర్టు ఫర్మిషన్ ఇచ్చిందని తెలిపారు. ఎంక్వైరీ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్ అడగగానే రెండు బోట్లు పంపిచామని తెలిపారు.