సీఎం అభయం: ఇద్దరు అధికారులు సస్పెండ్

  • Publish Date - March 28, 2019 / 03:27 AM IST

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన రైతు కొండపల్లి శంకరయ్య కుమారుడు శరత్.. తనకు జరిగిన అన్యాయంపై ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. “నేను రైతును. నా భూమిని వేరేవారి పేరున మార్చి పట్టా ఇచ్చారు. 11 నెలల నుంచి తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. లంచగొండి అధికారులను శిక్షించే వారు లేరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మీరు రైతులైతే సీఎంకు చేరే వరకూ షేర్‌ చేయండి” అని ఆ పోస్ట్ సారాశం.

ఆ పోస్ట్ వైరల్ కావడంతో సీఎం కేసిఆర్ స్వయంగా రైతుకు ఫోన్ చేశాడు. తనకు అండగా ఉంటానని మాట ఇచ్చారు.

ఈక్రమంలో సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ భారతి హోళీకేరి రైతు ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. రైతుకు చెందిన 271/ఎ సర్వే నంబరులో ఉన్న 7.01 ఎకరాల పట్టా భూమిని తన తండ్రి కొండపల్లి శంకరయ్య పేరుమీద నుంచి కొండపల్లి శంకరమ్మ పేరుపైకి వీఆర్‌ఓ కరుణాకర్‌ మార్చినట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆర్‌ఐ పెద్దిరాజు, వీఆర్‌ఓ కరుణాకర్‌లను వెంటనే సస్పెండ్‌ చేశారు. అప్పుట్లో తహసీల్దార్‌‌గా పనిచేసిన రాజలింగుపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. రైతు 11నెలల సమస్య వెంటనే తీరిపోయింది.