తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తుంటే… ఆదిలాబాద్ జిల్లాలో పాత పాలకవర్గం మాత్రం ఏకంగా గ్రామ పంచాయతీనే విక్రయించింది. భూమితో పాటు పంచాయతీ భవనాన్ని కూడా అమ్మేసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తుంటే… ఆదిలాబాద్ జిల్లాలో పాత పాలకవర్గం మాత్రం ఏకంగా గ్రామ పంచాయతీనే విక్రయించింది. భూమితో పాటు పంచాయతీ భవనాన్ని కూడా అమ్మేసుకుంది. ప్రజా ప్రతినిధుల విచ్చలవిడితనానికి ఈ ఘటన అద్దం పడుతోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల ప్రణాళికతో గ్రామాల అభివద్ధికి ముందడుగు వేస్తుంటే.. ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ పాలకవర్గం ఏకంగా భవనాన్నే అమ్మేసింది. లింగాపూర్ గ్రామానికి చెందిన అప్పటి సర్పంచ్ వర్ష, మిగతా సభ్యులంతా కలిసి.. కొత్త పంచాయతీకి స్థలం విక్రయించినట్టు, దానికి బదులుగా ఈ భూమి ఇచ్చినట్టు తీర్మానం చేశారు.
అయితే అందుకు ఉన్నతాధికారుల అనుమతి లేదు. పంచాయతీ స్థలం, భవనం విక్రయించిన వ్యక్తి… దాన్ని ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అసలు విషయం గ్రామ ప్రజలకు తెలిసింది. పంచాయతీ భవనం ఎవరికి ఇచ్చేదిలేదని ఆందోళన చేపట్టారు. మండల అధికారులతో పాటు జిల్లా అధికారులకు ఫిర్యాదు సైతం చేశారు గ్రామస్తులు.
పాత భవనాన్ని గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తికి ఇవ్వగా… ఆయన మాజీ సర్పంచ్ బంధువుకు ఈ మధ్యనే 80 వేలకు కట్టబెట్టారు. ల్యాండ్ తీసుకున్న వ్యక్తి… అక్కడ ఏకంగా ఓ నిర్మాణం సైతం ప్రారంభించడం వివాదాస్పదంగా మారింది. ఇదెక్కడి న్యాయమని… ఎవరు సర్పంచ్ అయితే వాళ్లు గ్రామ పంచాయతీని అమ్ముకుంటారా అని గ్రామస్తులు నిలదీస్తున్నారు.
ప్రభుత్వ ఆస్తులను గ్రామపంచాయతీ సిబ్బంది విక్రయించడానికి వీల్లేదు. కానీ లింగాపూర్‌లో మాత్రం… పాత భవనం, స్థలం విక్రయించి దస్తావేజులు రాసుకున్నారు. అధికారులు మాత్రం తమకు ఈ విషయం తెలియదంటున్నారు. తీర్మానం చేసినా విక్రయించడానికి కుదరదని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై గ్రామస్తులు కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. పాతదైనా.. కొత్తదైనా.. పంచాయతీ స్థలాన్ని విక్రయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.