వివేకాది హత్య.. టీడీపీ మంత్రి, ఎమ్మెల్సీ హస్తం : రవీంద్రనాథ్ రెడ్డి  

  • Publish Date - March 15, 2019 / 07:54 AM IST

వైఎస్ వివేకానంద రెడ్డి మృతి వెనక మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ సతీశ్ రెడ్డి హస్తం ఉందని కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ కుటుంబాన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో పన్నిన కుట్రలో భాగంగా వివేకానందరెడ్డి హత్య జరిగిందని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. జగన్ పై ఎయిర్ పోర్ట్ లో దాడి కూడా ఇందులో భాగం అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం కూడా ఈ కుట్రలో భాగమే అన్నారు. చేతికి మట్టి అంటకుండా టీడీపీ కుట్రలు పన్నుతోందని.. వివేకాది సాధారణ మృతి కాదన్నారు ఆయన. ఇది హత్యేనని రవీంద్రనాథ్ రెడ్డి గట్టిగా చెబుతున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తరువాత అన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు.
 
వివేకానందరెడ్డి మృతిపై ఏపీ పోలీసులు కాకుండా.. కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు జడ్జీల నేతృత్వంలో ఈ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారాయన. అప్పుడే కుట్ర బైటపడుతుందన్నారు. ఈ హత్య గురించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. జగన్, ఆయన కుటుంబానికి ప్రాణహాని ఉందనీ.. హత్యా రాజకీయాలు చేయడంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎహ్మెల్సీ సతీష్ రెడ్డి దిట్ట అని ఆరోపణలు చేశారు. 

2019, మార్చి 15 తేదీ శుక్రవారం పులివెందులలోని ఆయన నివాసంలోని బాత్రూంలో వైఎస్ వివేక రక్తపు మడుగులో పడి ఉన్నారు. గుండెపోటుతో చనిపోయారని మొదట వార్తలు వచ్చినా.. ఆ తర్వాత శరీరంపై ఉన్న గాయాలతో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపణలు మరిన్ని అనుమానాలకు దారి తీస్తోంది.