పాపికొండల్లో.. వరంగల్ నుంచి ఒకే కుటుంబానికి చెందిన 14 మంది

వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన 14మంది కుటుంబ సభ్యుల బృందం ప్రమాదానికి గురైంది. పాపికొండల పర్యటనకు బయల్దేరిన వారు ఆదివారం ఉదయం 10:30 గంటలకు గండి పోచమ్మ దేవాలయం దాటి బోటు ముందుకు వెళ్లింది. దేవీపట్నం సమీపంలో కచులూరు వద్ద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వెనక్కి తీసే క్రమంలో ఘటన జరిగింది. 

ఇందులో వరంగల్ లోని ఒకే కుటుంబానికి చెందిన 14మంది ఉన్నారు. వారిలో ఐదుగురిని మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. బసికె అవినాశ్(17)తన తల్లి కవితా రాణికి ఫోన్ చేసి తాము బయల్దేరుతున్నామని చెప్పాడు. బోటులో సిగ్నల్ అందడం లేదని గమ్యానికి చేరుకున్న తర్వాత తానే తిరగి కాల్ చేస్తానని మాటిచ్చాడు. కొడుకు ఫోన్ చేస్తాడని చూస్తూ ఈ ఘటన గురించి తెలియగానే గుండెలు పగిలేలా ఏడ్చింది ఆ తల్లి. 

అవినాశ్ తండ్రి తిరుపతి 2013లోనే చనిపోయాడు. ఇళ్లలో పనిచేసుకుంటూ ఇద్దరు కొడుకులతో కలిసి బతికేస్తుంది. పర్యటనకు వెళ్లకుండా ఉన్న చిన్న కొడుకు అరవింద్ ఒక్కడే మిగిలాడని వాపోయింది. ఈ కుటుంబం వరంగల్ అర్బన్ జిల్లాలోని కాజిపేట మండలం కడిపికొండ గ్రామానికి చెందిన మహరాజుల కాలనీలో నివాసముంటుంది. 

బంధువులంతా కలిసి ఆగష్టు 9న గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. వారంతా ఆదివారం రాత్రికి ఇంటికి చేరుకోవాల్సి ఉంది. బసికె దశరథం, బసికె వెంకటస్వామి, దర్శనాల సురేశ్, గొర్రె ప్రభాకర్, ఆరేపల్లి యాదగిరి మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. సీవీ వెంకటస్వామి(62), బసికె రాజేంద్ర ప్రసాద్(50), బసికె ధర్మరాజు(42), బసికె రాజేందర్(58), బసికె అవినాశ్(17), కొండూరు రాజ్‌కుమార్(40), గడ్డమీది సునీల్(40), కొమ్ముల రవి(43), గొర్రె రాజేంద్ర ప్రసాద్(55)ల ఆచూకీ తెలియలేదు.