‘వాలెంటైన్స్ డే’ ను ఫిబ్రవరి 14నే ఎందుకు జరుపుకుంటారు…?

  • Publish Date - February 8, 2019 / 10:30 AM IST

చేసుకోవాలనే ఉద్ధేశ్యం ఉండాలి గానీ, ప్రతి రోజు పండుగరోజే. అలాంటిది ప్రత్యేకించి ఒక్క రోజునే కేటాయించి విశిష్టంగా జరుపుకోవడానికి మూల కారణం ఏదో ఒకటి ఉంటుందిగా. అలాంటిదే  స్వేచ్ఛా విహంగాలై ఎల్లలు లేని చూపించుకోవడానికి ప్రేమ పక్షులు చేసుకునే పండుగ రోజే వాలెంటైన్స్ డే(ప్రేమికుల రోజు).

 

ప్రతి రోజూ కలుసుకునే పరిచయాలే. చూసుకునే మనుషులే అయినా ఏదో కొత్తదనం. ఒక్కో క్షణం అద్భుతానంతాలు రుచి చూసే క్షణాలు. ఇవన్నీ ప్రేమలోనే సాధ్యపడతాయి. యుగాలకొద్దీ వేచి చూసిన తరగని ప్రేమ.. జీవితమంతా వెచ్చించిన ఇంకా మిగిలి ఉండే భావనను ఒక్క రోజులో చూపించేందుకు సిద్ధమవుతున్నారంటే ఆ రోజుకు ఎంత ప్రత్యేకత ఉండి ఉండాలి. దాని గురించి షార్ట్ కట్‌గా చెప్పాలంటే.. 

 

 

 

క్రీస్తు శకం రోమ్ నగరంలో వాలెంటైన్స్ అనే లవ్ డాక్టర్ ఉండేవాడు. ప్రేమతోనే జీవితం ముడిపడి ఉందని, దాంతోనే ఆనందం, ఆహ్లాదంగా మారుతుందనే ధోరణిలో జీవనం సాగించేవాడు. ప్రేమను ప్రోత్సహించడం, యువతీ యువకులకు ప్రేమ గురించి బోధనలు చేస్తుండటమే పనిగా పెట్టుకున్నాడు. అతని గురించి నగరమంతా తెలిసిపోయింది. అభిమానులు పెరిగిపోతున్నారు. ప్రేమికులందరికీ అతనొక దేవుడిలా కనిపించడం మొదలుపెట్టాడు. 

 

దీంతో అప్పటి రోమ్ రాజు క్లాడియస్ విసిగిపోయాడు. దేశ భవిష్యత్ ప్రేమ మత్తులో పడి నాశనమైపోతుందేమోనని భయపడ్డాడు. దీనంతటికీ కారణం వాలెంటైనేనని భావించి.. అతను చనిపోతే సమస్య తగ్గిపోతుందనుకుని మరణశిక్ష విధించాడు. సరిగ్గా ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్‌కు విధించిన శిక్ష అమలు చేయడంతో అతనిని ఉరి తీశారు. 

 

ప్రేమకు మధ్యవర్తిగా నిలిచాడే తప్ప ఆయనే మూల కారణం కాదు కాబట్టి అక్కడితో ఈ ప్రయాణం ఆగలేదు. అలాగే వాలెంటైన్ గురించి ఎవ్వరూ మర్చిపోలేదు. ప్రేమికులంతా కొన్ని సంవత్సరాల పాటు వాలెంటైన్ పట్ల అధికారులు ప్రవర్తించిన తీరును పలుమార్లుగా దుయ్యబట్టడం మొదలుపెట్టారు. కొన్నేళ్ల తర్వాత అంటే రెండు దశాబ్దాల తర్వాత  క్రీ.శ. 496లో అప్పటి పోప్‌(గెలాసియస్) ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్‌ డేగా ప్రకటించాడు.

 

ప్రపంచంలో ఓ ప్రాంతమైన రోమ్‌లో.. శతాబ్దాల క్రితం జీవించిన ఒక క్రైస్తవ ప్రవక్త పేరుతో మొదలైన ఈ ప్రేమికుల రోజు(వాలెంటైన్స్ డే) ప్రపంచ వ్యాప్తంగా యువత అంతా ప్రేమికుల దినోత్సవంగా గుర్తుంచుకునే విధంగా మారిపోయింది.

 

ఇంతగొప్ప చరిత్ర ఉన్న వాలెంటైన్స్ డే రోజును ప్రేమికులే కాదు, ప్రేమిస్తున్నామని భావించి సెలబ్రేట్ చేసుకునే వాళ్లు లేకపోలేదు. ఖరీదైన బహుమతులు, కులాసా కబుర్లు, తొందరపాటుతో చేసే తప్పుల్లోనే సమయం గడిచిపోతుంది. అవధుల్లేకుండా గడిపే ఆనందం, అద్భుతమైన ప్రపంచం రంగులు అనుభవించాలంటే మనస్సుతో మమేకమై ప్రేమించాలి. జీవితాన్ని ఆస్వాదించాలి. 

కమాన్ లెట్స్ డు లవ్..