విశాఖ : కో ఆపరేటివ్ డెయిరీలను సీఎం చంద్రబాబు పూర్తిగా నాశనం చేశారని వైసీపీ చీఫ్ జగన్ ఆరోపించారు. చిత్తూరు డెయిరీ సహా చంద్రబాబు అన్నీ మూసివేయించారని మండిపడ్డారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. అబద్దాలు, మోసాలతో గడిపేశారని జగన్ మండిపడ్డారు.
చెరుకు రైతులకు ప్రభుత్వం రూ.5 కోట్ల బకాయిలు చెల్లించలేదన్నారు. తుమ్మపాల ఫ్యాక్టరీని తెరిపిస్తామని నాలుగేళ్లు ఊరించి మోసం చేశారని చెప్పారు. బెల్లం రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని జగన్ వాపోయారు. రైతుల సొమ్మును చంద్రబాబు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ డెయిరీ ఉద్యోగుల కష్టాలను తెలుసుకున్నా అని చెప్పిన జగన్.. అధికారంలోకి వస్తే తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ప్లాట్ల రుణాలను మాఫీ చేస్తానని జగన్ వాగ్దానం చేశారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మోసాలు, అబద్దాలే చూశామన్న జగన్.. ఈసారి చంద్రబాబుకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.