మేము వచ్చాక : 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

  • Publish Date - March 24, 2019 / 02:14 PM IST

కృష్ణా: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు చేయూత నిచ్చేలా ప్రతి ఏటా జనవరిలోనే ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్  విడుదల చేస్తామన్నారు. హాస్టళ్లు, మెస్ ఛార్జీల కోసం ఏడాదికి రూ.25వేలు ఇస్తామన్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో వైసీపీ ఎన్నికల ప్రచారం సభలో జగన్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఐదేళ్ల పాలనపై విమర్శలు  చేశారు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా రాదు.. ఉద్యోగాలు రావు.. అభివృద్ధి జరగదు అని జగన్ అన్నారు. జాబు రావాలంటే బాబు పోవాలి అని ప్రతీ ఊళ్లో వినిపిస్తోందన్నారు.

వైసీపీ అధికారంలోకి రాగానే ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తామని.. ప్రతి ఊళ్లో 10మంది గ్రామ వాలంటీర్లుగా చేర్పించి రూ.5వేల గౌరవ వేతనంతో గ్రామ సెక్రటేరియట్ కు అనుసంధానం చేస్తామని జగన్ చెప్పారు. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ ఏర్పాటు చేస్తామని.. వాళ్లే సంక్షేమ పథకాలను ఇంటి ఇంటికి డెలివరీ చేస్తారని చెప్పారు.