YSR మత్స్యకార భరోసా పథకం : సీఎం జగన్ వరాల జల్లు  

  • Publish Date - November 21, 2019 / 05:17 AM IST

నవంబర్ 21  ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ఈసందర్భంగా సీఎం జగన్ గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కొమనాపల్లి వేదికగా YSR మత్స్యకార భరోసా పథకం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా మత్య్సకారులకు వరాల జల్లు కురిపించారు. ప్రజలు ఇచ్చిన దీవెనలతో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తున్నామని..చేపల వేట నిషేధ కాలంలో ఉన్న మత్స్యకార భృతిని.. రూ. 4 వేల నుంచి రూ.10 వేలకు పెంచామని..డీజిల్ సబ్సిడీ రూ.9కి పెంచామని తెలిపారు. 

సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మత్య్సకారులు చనిపోతే..వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారాన్ని అందిస్తామని సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలతో ఇచ్చిన ప్రతిహామీని బాధ్యతగా నెరవేరుస్తున్నామన్నారు.  కాగా..ఈ  పథకంతో రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో కల్పించడానికి బడ్జెట్‌లో మత్స్య శాఖకు రూ.551 కోట్లు కేటాయించింది.