వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. శుక్రవారం(ఫిబ్రవరి 28,2020) గుంటూరు జిల్లా తాడేపల్లి
వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. శుక్రవారం(ఫిబ్రవరి 28,2020) గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఓ వివాహ కార్యక్రమానికి ఆర్కే హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించేందుకు ఆయన వేదిక పైకి వెళ్లగా.. ఒక్కసారిగా వేదిక కుప్పకూలింది. దీంతో ఆర్కే కింద పడ్డారు. ఆయన కుడి కాలి పాదానికి గాయమైంది. చికిత్స కోసం వెంటనే ఆయన్ను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆర్కే ఇంటికి వెళ్లిపోయారు.
ఈ ప్రమాదంలో ఆర్కే స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే వైసీపీ కార్యకర్తలు కంగారుపడ్డారు. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆర్కేని పరామర్శించారు.
గురువారం(ఫిబ్రవరి 27,2020) సీఎం జగన్‌కు ఎమ్మెల్యే ఆర్కే లేఖ రాసిన సంగతి తెలిసిందే. నీరుకొండ కొండపై అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. గతంలో చంద్రబాబు ఐనవోలులో 20 ఎకరాలలో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటుకు శంకుస్దాపన చేశారని, అలాగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు గుర్తు చేశారు. అయితే స్మృతి వనం ఏర్పాటు పనులు ఆగిపోయినట్లు లేఖలో తెలిపారు. అదే స్థాయిలో 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం నీరుకొండలో ఏర్పాటు చేయాలని జగన్ ని కోరారు.