వివేకానందరెడ్డి మృతితో వైఎస్ఆర్‌సీపీకి షాక్

  • Publish Date - March 15, 2019 / 02:16 AM IST

వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం వైఎస్ఆర్‌సీపీ శ్రేణులను షాక్ కు గురి చేసింది. వివేకా, జగన్ కుటుంబసభ్యులే కాదు వైసీపీ నాయకులు కూడా దిగ్భ్రాంతి చెందారు. ఎంతో అనుభవం ఉన్న నాయకుడు ఇక లేడు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీ చీఫ్ జగన్ తీవ్రమైన షాక్ కు గురయ్యారు. ఎన్నికలకు వైసీపీ రెడీ అయ్యింది. అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటిచేందుకు సన్నద్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపిక, కార్యకర్తల మొబలైజేషన్ లో వివేకానంద రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ కు సహకారం అందించారు. 3, 4 రోజులుగా లోటస్ పాండ్ లోనే ఉండి రాజకీయ వ్యవహారాలను చూసుకున్నారు. కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చూసుకుంటున్నారు. టికెట్లు రాని వారు ఆందోళనలకు దిగితే.. వారికి సర్ది చెప్పారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా.. కట్టుబడి ఉండాలని అభ్యర్థుల గెలుపుకి సహకరించాలని కోరారు.
Read Also: బాత్రూంలో ఏం జరిగింది : వివేకానందరెడ్డి మృతిలో 5 అనుమానాలు

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన శివరామిరెడ్డి అనుచరులు.. లోటస్ పాండ్ దగ్గర ఆందోళనకు దిగారు. విశ్వేశ్వరరెడ్డికి కాకుండా శివరామిరెడ్డికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వివేకానందరెడ్డి కారుని వారు అడ్డుకున్నారు. కారు దిగి బయటకు వచ్చిన వివేకానందరెడ్డి.. వారికి సర్ది చెప్పారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని బలపరచాలని, ఆయన ఎంపిక చేసిన వారికి మద్దుతివ్వాలని విజ్ఞప్తి చేశారు. మనమంతా కలిసి వైసీపీ అభ్యర్థుల గెలుపుకి కృషి చేయాలని సూచించారు. టికెట్ కోసం ఆందోళనకు దిగిన వారికి సర్ది చెప్పి వారందరని పంపించేశారు. ఆ వివాదాన్ని అక్కడికక్కడ పరిష్కరించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆయన కుటుంబం నుంచి వివేకానందరెడ్డి రాజకీయాల్లోకి కొనసాగుతూ వచ్చారు. వైఎస్ మరణానంతరం కేబినెట్ లో చేరిన వివేకానందరెడ్డి… కొంతకాలం వ్యవసాయశాఖమంత్రిగా సేవలందించారు. అనంతరం కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి జగన్ తో ఉంటూ వైసీపీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఇలాంటి సమయంలో వివేకా హఠాన్మరణం జగన్ తో పాటు పార్టీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
Read Also: వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు

1950 ఆగస్టు 8న వివేకా పులివెందులలో జన్మించారు. వైఎస్ సోదరుడిగా, జగన్ బాబాయ్ గా వివేకానందరెడ్డి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన కుడి భుజంగా మెలిగారు. అన్ని విషయాల్లో అన్నకు చేదోడు వాదోడుగా నిలిచారు. అలాంటి వ్యక్తి మరణం జగన్ కుటుంబానికి తీరని లోటుగా చెప్పొచ్చు. కడప నుంచి లోక్ సభకు వివేకా ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పని చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. 1989, 1994లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999, 2004లో కడప లోక్ సభ స్థానం నుంచి ఎన్నికయ్యారు.