భారీ గుంతలో పడిన బస్సు: ఆరుగురు దుర్మరణం

  • Publish Date - January 16, 2020 / 02:05 AM IST

చైనాలోని జినింగ్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న పెద్ద గుంతలో పడిపోయింది. అంతా చూస్తుండగానే అందులోని ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నారు. రోడ్డు మీద ట్రాఫిక్ మధ్యలో ఆగున్న బస్సు ఒక్కసారిగా రోడ్డు మధ్యలో ఏర్పడిన భారీ గుంతలో జారి పడిపోయింది.

బస్సు గుంతలో పడగానే మంటలు ఏర్పడి, పొగలు వచ్చాయి. విద్యుత్ స్తంభం బస్సు మీద పడటం వల్లే ఈ మంటలు ఏర్పడి ఉండవచ్చని తెలుస్తోంది. జనవరి 13న సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో అక్కడిక్కడే ఆరుగురు ప్రయాణికులు చనిపోయారు, మరో 16 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక పత్రికలు వెల్లడించాయి. అనంతరం గాయపడిన ప్రయాణికులను దగ్గరలోని హాస్పిటల్ కు తరలించారు. 

రోడ్డుపై ఏర్పడిన గుంత సుమారు 32 అడుగుల లోతు ఉందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న రిటైర్డ్ పోలీస్ అధికారి సన్ వాంగ్హాంగ్ మాట్లాడుతూ.. బస్సు ప్రమాదం జరిగిన వెంటనే ఓ మహిళ సాయం కోసం అరుస్తుంటే.. దగ్గరకు వెళ్లి చూశాను. ఆమె రోడ్డు గుంతపై ఉన్న కొనకు వేలాడుతూ కనిపించింది. నేను వెంటనే ఆమెకు  కాపాడేందుకు ముందుకెళ్లాను. అంతలో ఆ రోడ్డు మరోసారి కుంగిపోయింది. ఆ మహిళ కూడా గుంతలో పడిపోయింది అని తెలిపారు.