AP Heatwave Alert: ఏపీలో భానుడి భగభగలు.. ఈ జిల్లాల్లో భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఈ నెల 26వరకు జాగ్రత్త..
వచ్చే 7 రోజుల పాటు అత్యవసర వాతావరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, క్షేత్ర స్థాయిలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించింది.
- Naveen
- Updated on- May 20, 2026 / 07:31 PM IST
AP Heatwave Alert: ఏపీపై భానుడు పగబట్టాడు. నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 42 నుంచి 47 డిగ్రీల వరకు టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. ఇక, కోస్తాంధ్ర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వచ్చే 7 రోజుల పాటు అన్ని పట్టణ, స్థానిక సంస్థలు అత్యవసర వాతావరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, క్షేత్ర స్థాయిలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించింది. పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మున్సిపల్ కమిషనర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా మధ్య, ఉత్తర కోస్తా జిల్లాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ నెల 26 వరకు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఎండల బారిన పడే ప్రమాదం ఉన్న ప్రజలను రక్షించడానికి, పౌర సేవలకు అంతరాయం కలగకుండా చూడటానికి, వడదెబ్బ మరణాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు మైకులు, సోషల్ మీడియా, వార్డ్ సచివాలయాలు, మున్సిపల్ వాహనాలు, మీడియా, ఎలక్ట్రానిక్ డిస్ ప్లే బోర్డుల ద్వారా వడగాల్పులు హెచ్చరికలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
మధ్యాహ్నం సమయంలో పనులను వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరింది ప్రభుత్వం. కార్మికులకు నీడ, నీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. బస్టాండ్లు, మార్కెట్లు, కార్మికులు ఉండే ప్రాంతాలు, ఆసుపత్రులు, స్కూళ్లు, అన్న క్యాంటీన్లు ఇతర బహిరంగ ప్రదేశాల్లో తాగునీటి సదుపాయం కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం తాత్కాలిక వాటర్ కియోస్క్ లు, అలాగే అవసరమైన చోట చల్లని నీడ ఏర్పాటు చేయాలని సూచించారు.
పారిశుధ్య కార్మికులు, బహిరంగ ప్రదేశాల్లో పని చేసే శ్రామికులు, వీధి వ్యాపారులు, నిరాశ్రయులు, వృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుంటూ వార్డు స్థాయి పర్యవేక్షణ బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళల్లో మున్సిపాలిటీకి సంబంధించిన బహిరంగ పనులను క్రమబద్దీకరించాలని, పారిశుధ్య సేవలు, తాగునీటి సరఫరా నీటి నాణ్యత పరిశీలన నిరంతం కొనసాగేలా చూడాలన్నారు.
Also Read: 134 మంది మృతి.. ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్ కొత్త రకం..
