AP Heatwave Alert: ఏపీ ప్రజలకు హెచ్చరిక.. రేపు బయటకు రావొద్దు.. తీవ్ర ఎండలు, వేడిగాలుల ముప్పు
ఇక, రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 44°C దాటేశాయి. 16 జిల్లాల్లో 198 మండలాల్లో 41°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- Naveen
- Published on- April 26, 2026 / 05:58 PM IST
AP Heatwave Alert: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రికార్డ్ స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటు ఎండలు, అటు వేడి గాలులు.. దీంతో జనాలు విలవిలలాడిపోతున్నారు. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తాజాగా ఏపీ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది.
రాష్ట్రంలో రేపు తీవ్ర ఎండలు, వడగాల్పుల ముప్పు ఉందని తెలిపింది. 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందంది. మరో 26 మండలాల్లో సాధారణ వడగాల్పుల హెచ్చరిక జారీ చేసింది. విజయనగరం జిల్లాలో 8 మండలాలపై తీవ్ర ప్రభావం ఉండనుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 14 మండలాలకు అలర్ట్ ఇచ్చింది. అల్లూరి జిల్లాలో అనంతగిరి మండలంలో తీవ్ర వడగాలుల ప్రభావం ఉండనుంది.
ఇక, రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 44°C దాటేశాయి. 16 జిల్లాల్లో 198 మండలాల్లో 41°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కంభంలో 44.7°C డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తీవ్రమైన ఎండల నేపథ్యంలో బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. తలకు టోపీ లేదా గొడుగు, సన్ గ్లాసెస్ తప్పనిసరి అని చెప్పారు. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలన్నారు. బీపీ, షుగర్, గుండె రోగులు ఎండలో బయటకు రావద్దని హెచ్చరించారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.
