బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నాయి. కోస్తా, ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుండగా దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణం కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి వైపుకి వంపు తిరిగి ఉంది. నైరుతి రుతుపవనాలు మరింత బలపడి కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగతంతో బలమైన ఈదురులు గాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించకలు జారీ చేసింది. శనివారం, అదివారం తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాం తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
తెలంగాణలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
తెలంగాణలోని జక్రాన్ పల్లి 5, కాగజ్ నగర్, దహేగాన్ 4, బెజ్టూరు, నిజామాబాద్, వేల్పూరు 3, సిర్పూరు, కోటగిరి, కాళేశ్వరం, ఆర్మూర్ లో 2 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఏపీలో పాడేరులో 5, నర్సీపట్నం, కళింగపట్నం 4, తుని, చోడవరం, చింతపల్లి 3, మందన, పాలకొండ, ఇచ్చాపురం ప్రాంతాల్లో 2 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదు అయింది.