AP Rains: మరో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన.. 3 రోజులు కుండపోత వానలు.. టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు..
కాకినాడ జిల్లా రౌతలపూడిలో 42.2 మిల్లీమీటర్లు, అల్లూరి జిల్లా పెదబయలులో 41 మిమీ, అనకాపల్లిలో నర్సీపట్నంలో 40.2 మిమీ, గుంటూరు జిల్లా బేతపూడిలో 38 మిల్లీమీటల్ల వర్షపాతం నమోదైందన్నారు.

AP Rains: ఉత్తర కోస్తాంధ్ర మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రేపు(ఆగస్ట్ 12) పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల కింద ఉండొద్దన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ దగ్గర ఉండరాదని హెచ్చరించారు.
ఎల్లుండి (ఆగస్ట్ 13) నాటికి వాయువ్య దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో బుధవారం, గురువారం కోస్తాంధ్రలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందన్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. సహాయక చర్యల కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలని కోరారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సోమవారం సాయంత్రం 5 గంటల నాటికి కాకినాడ జిల్లా రౌతలపూడిలో 42.2 మిల్లీమీటర్లు, అల్లూరి జిల్లా పెదబయలులో 41 మిమీ, అనకాపల్లిలో నర్సీపట్నంలో 40.2 మిమీ, గుంటూరు జిల్లా బేతపూడిలో 38 మిల్లీమీటల్ల వర్షపాతం నమోదైందని తెలిపారు.
ఇప్పటికే రాష్ట్రంలో వానలు కుమ్మేస్తున్నాయి. నాన్ స్టాప్ గా కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల పంటలు నీట మునగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.